సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించే దమ్ముందా ?
కొమ్మాలపాటికి కావటి మనోహర్ సవాల్
పట్నంబజారు(గుంటూరు): పూర్తి నీతి నిజాయితీలతో సదావర్తి భూములు కొనుగోలు చేసి ఉంటే సీనియర్ సిట్టింగ్ జడ్జితోనూ, లేక రిటైర్డ్ జడ్జితోనూ దర్యాప్తు చేయించే దమ్ము ఉందా అని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు సవాల్ విసిరారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లాకార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అమరావతిలోని సదావర్తి సత్రం భూముల విషయంలో నిబంధనలకు తిలోదకాలిచ్చిన మాట వాస్తవం కాదా అని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను ప్రశ్నించారు. భూములు ఆక్రమణలో ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసి, ఆలయ అభివృద్ధికి ఆ నిధులు వెచ్చించాలని కొమ్మాలపాటి లేఖ రాయడం నిజం కాదా అన్నారు.
ఈ నెల 26వ తేదీన చెన్నైలో సదావర్తికి సంబంధించిన 83 ఎకరాలను వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ చైర్మన్ ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో పరిశీలించామని తెలిపారు. స్థానికులను, అక్కడి ప్రజలను, మీడియా ప్రతినిధులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నామన్నారు. భూములను పూర్తిస్థాయిలో అక్రమంగా కొనుగోలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
ఎకరం రూ.6.50 కోట్లు ఉందని చెప్పడం నిజం కాదా..?
తమిళనాడు ప్రభుత్వమే రూ. 6.50 కోట్లు ఎకరం విలువ ఉందని చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా, దేవాదాయ శాఖ భూములు విక్రయించాలంటే తప్పనిసరిగా హైకోర్టు అనుమతి అవసరమని, వాటిని కూడా బేఖాతరు చేసి కేవలం రూ. 28 లక్షలు చొప్పున భూములు కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రణాళికా బద్ధంగానే భూములు దోచుకునేందుకు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డిని నియమించుకున్నారని ఆరోపించారు.
కొమ్మాలపాటి ఆఖరికి దేవుడి భూములను కూడా వదలడం లేదని ధ్వజమెత్తారు. భూములు నిజాయితీతో కొన్నారంటే బహిరంగ చర్చకు రాగలరా... అని ప్రశ్నించారు. స్పష్టంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారి బ్రమరాంబ వేలంపాటలో అక్రమాలు జరిగాయని చెప్పినప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి, సీఎం ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ సేవాదళ్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొత్తాచిన్నపరెడ్డి, సయ్యద్ మాబు, పార్టీనేతలు తేలుకుట్ల శ్రీకాంత్, పాలపాటి రఘు, బసవపూర్ణచంద్రరావు పాల్గొన్నారు.