
సాక్షి, చిత్తూరు : రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అన్నారు. గోదావరి జలాలను కృష్ణానదిలో కలపాలనే విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రెండుసార్లు చర్చలు జరిగాయన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ తమిళనాడు కంచిలోని అత్తివరదరాజ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమలో వర్షాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. గోదావరి జలాలు వృధాగా పోనివ్వకుండా ఏపీ ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏపీకి యువనాయకుడు పట్టుదలతో పనిచేసే సీఎం ఉన్నారని, ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
కేసీఆర్ మా ఇంటికి రావటం అదృష్టం : ఆర్కే రోజా
తమిళనాడులోని కాంచీపురంలో 40 సంవత్సరాలకు ఒకసారి కనిపించే అత్తివరదరాజ స్వామి దర్శనానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తన ఇంటికి రావడం అదృష్టమని వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రెండు గంటల సేపు మా కుటుంబ సభ్యుల్లా మా ఆతిథ్యం స్వీకరించారు. చిత్తూరు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో రాయలసీమ అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల గురించి చర్చించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదే విధంగా ఆయన నన్ను ఒక కుమార్తెగా భావించడం నా అదృష్టమ’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment