
ఎన్నికలకు ముందు గంగిరెద్దులోళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ రాగానే గంగిరెద్దులోళ్లు వచ్చినట్టుగా ఎన్నికలు రాగానే పార్టీలంటూ హడావుడి చేస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ టీడీపీ ఇన్‌చార్జి నెహ్రూనాయక్ కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘రాజకీయాల్లోకి వస్తానంటూ పవన్‌కల్యాణ్ అనే హీరో బయల్దేరిండట. అంతకుముందు ఎన్నికల్లో ఆయన అన్న చిరంజీవి వచ్చి ఏం చేసిండు? ఇప్పుడు తమ్ముడు పవన్‌కల్యాణ్ కూడా అదే చేస్తడు.
ఇప్పుడు చిరంజీవి వంటివారు కాదు చిరునవ్వుల తెలంగాణ కావాలె. సంక్రాంతి రాగానే గంగిరెద్దులోళ్లు వచ్చేవారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే నేను నేను అంటూ అందరూ వచ్చి ఆగమాగం చేస్తరు. వాళ్లను పట్టించుకోవద్దు. ఇంకా ఆంధ్రోళ్ల పాలన మనకు అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, ఇతర నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే...
తెలంగాణ వచ్చింది కదా అని రిలాక్స్ కావొద్దు. అసలు పని ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు రాజకీయాలు తక్కువ, కార్యం ఎక్కువగా ఉండాలి.
టీఆర్‌ఎస్‌కు 17 ఎంపీలుంటేనే కేంద్రంలో తెలం గాణకు కావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం ఇంకొకరిని చేయాలంటే ఎట్లా? యుద్ధం చేయాలంటే కత్తి మన చేతిలోనే ఉండాలి.
మాజీ సీఎం కిరణ్ వంటివారు ఇంకా తెలంగాణను ఆపుతానంటూ హడావుడి చేస్తున్నారు. అపాయింట్‌మెంట్ డేట్ వచ్చింది, ఎవరూ ఏమీ చేయలేరు.
తెలంగాణకోసం అందరూ రోడ్ల మీదకొచ్చి కొట్లాడుతుంటే ఎక్కడా కనిపించని పార్టీలు ఎన్నికలు రాగానే గడబిడ చేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి కావాలంటె మంచి నాయకుడు కావాలి. మనం ఇస్తున్న హామీలను, చేయాల్సిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి.
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తాం. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం.