'స్ట్రీట్ లీడర్లా కాదు.... సీఎంలా వ్యవహారించాలి'
కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి శుక్రవారం కర్నూలులో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఎటువంటి భాష మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్కు రాజ్యాంగంపై అవగాహనే లేదని విమర్శించారు. తమతో సంప్రదించకుండా కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. స్ట్రీట్ లీడర్గా కాకుండా ఓ ముఖ్యమంత్రిగా వ్యవహారించాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు కేఈ కృష్ణమూర్తి హితవు పలికారు.
కొత్త ప్రాజెక్ట్లకు నీటి కేటాయింపులు లేవని ట్రిబ్యునల్ స్పష్టం చేసినా... కేసీఆర్ కొత్త ప్రాజెక్ట్లు ఎలా ప్రారంభిస్తారని కేఈ ప్రశ్నించారు. ఓ వేళ కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభించాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతి తప్పని సరి అని ఆయన గుర్తు చేశారు. పట్టిసీమ పోలవరం ప్రాజెక్ట్లో అంతర్భాగం అని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రాజెక్ట్కు అనుమతి అవసరం లేదని కేఈ స్పష్టం చేశారు.