చంద్రబాబు చూపంతా 'ఆ జిల్లా' పైనే..
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కె.ఈ. కృష్ణమూర్తి మరోసారి అసంతృప్తి వెళ్లగక్కారు. చంద్రబాబు చూపంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఉందని ఎద్దేవా చేశారు. తన సొంత జిల్లా కర్నూలుపై ఆయన దృష్టి పెట్టడం లేదని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కర్నూలులో కేఈ కృష్ణమూర్తి విలేకర్లతో మాట్లాడారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ముచ్చటగా మూడంటే మూడే సీట్లు గెలిచామంటే అందులో తమ తప్పు లేదని ఆయన సమర్థించుకున్నారు.
జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు... జిల్లాలో ఏ వీధి ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. చాలా శ్రమ పడాల్సి ఉందని జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు మార్పు చాలా సాహసవంతమైన చర్య అని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. చంద్రబాబుపై అసంతృప్తిని వెళ్లగక్కడం కేఈ కృష్ణమూర్తికి కొత్త కాదు. ఏపీ నూతన రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కేఈ మొదట్లోనే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.