సీఎం.. డిప్యూటీ డిష్యుం డిష్యుం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మధ్య అగాధం రోజురోజుకూ పెరిగిపోతోంది. రెవెన్యూ శాఖకు చెందిన బదిలీల విషయంలో తాజాగా చెలరేగిన చిచ్చు.. కేఈని తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు సమాచారం. ఈ విషయంలో లోకేష్ బృందం డిప్యూటీ సీఎం మీద ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు ఆయనను పిలిచి క్లాస్ తీసుకున్నారని, దాంతో కేఈ తీవ్రంగా కలత చెందారని అంటున్నారు.
వాస్తవానికి ఉపముఖ్యమంత్రి పదవి అయితే ఇచ్చినా.. తనకు ఏ విషయంలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కేఈ కృష్ణమూర్తి ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నారు. రాజధాని విషయంలో రాయలసీమను అసలు పరిగణనలోకి కూడా తీసుకోలేదన్న ఆగ్రహంతో ఆ విషయమై వేసిన కమిటీలో కూడా తనకు చోటు అవసరం లేదని ఆయన ఇంతకుముందు చెప్పేశారు. రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుందని కొంతమంది మంత్రులు బహిరంగ ప్రకటనలు చేయడంపైనా పరోక్ష విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు తాజాగా వారం రోజుల క్రితం రెవెన్యూశాఖ బదిలీల విషయంలో మరో చిచ్చు రేగింది. బదిలీల ఫైలు విషయంలో చంద్రబాబు కేఈని పిలిచి క్లాస్ తీసుకోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చివరకు బదిలీల ఫైలు తెప్పించి, దాన్ని నేరుగా ముఖ్యమంత్రికే ఇచ్చేసినట్లు తెలిసింది. రాజకీయాల్లో తాను చంద్రబాబు కంటే సీనియర్ని అయినా.. తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడంలేదని పలు సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారని కూడా ఆయన అంటున్నారు. మొత్తమ్మీద బదిలీల వ్యవహారం, లోకేష్ బృందం జోక్యం... ఇవన్నీ కలిసి సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి మధ్య పెను అగాధాన్ని సృష్టించాయి.