- ఎస్‌వో, ఎంఈవోలతో సిబ్బంది సతమతం
- రికార్డులు అందజేయని పాత ఎస్‌వోలు
- సిబ్బందికి రాని రెండు నెలల జీతాలు
కొయ్యూరు : మన్యంలోని 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోనూ కుర్చీలాట కొనసాగుతుంది. గతంలో ఆయా పాఠశాలల్లో పనిచేసిన ప్రత్యేకాధికారి(ఎస్‌వో), కొత్తగా బాధ్యతలు అప్పగించిన వారి మధ్య వివాదం సాగుతోంది. కొయ్యూరులో డెప్యుటేషన్‌పై పనిచేసిన మాధురిని తొలగించినట్టుగా అధికారులు చెబుతుంటే ఆమె మాత్రం రికార్డుల్లో సంతకాలు చేస్తున్నారు. మరో రిజిష్టర్‌లో ఇంఛార్జీగా ఉన్న ఎంఈవో బోడం నాయుడు కూడా సంతకాలు చేస్తున్నారు.
పాఠశాలలు తెరచినా ఇంత వరకు వంటపాత్రలు నుంచి ఇతర రికార్డులు ఏవీ కూడా పాత ఎస్‌వో అందజేయలేదు. దీంతో బాలికలు వస్తే ఎలా వంట చేయాలో తెలియక అక్కడ సిబ్బంది సతమతం అవుతున్నారు. దీనికితోడు ఈ యేడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన ఏడుగురు బాలికలకు టీసీలు ఇచ్చేందుకు కూడా వాటి పుస్తకం లేదు.
ఇప్పుడు ఆ పుస్తకం కోసం దరఖాస్తు చేశారు. మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మాధురి డెప్యూటేషన్‌పై కస్తూరిబా ఎస్‌వోగా పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల డెప్యూటేషన్లపై వచ్చిన వారిని తొలగించింది. వారికి బదులుగా పదవీ విరమణ చేసిన వారిని లేదా నిరుద్యోగులను నియమించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఆమెను తొలగించారు. అయితే తనకు రావలసిన డైట్ బిల్లులపై ఆమె కోర్టును ఆశ్రయించడంతో వెంటనే వాటిని చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. తనకు బిల్లులు చెల్లించిన తరువాతనే మానేస్తానని, అంత వరకు మానేది లేదని ఆమె అంటూ క స్తూరిబాలో పనిచేశారు. రాజీవ్ విద్యా మిషన్ పీవో నగేస్ ఏప్రిల్‌లో ఎంఈవోలకు ఇంచార్జీ బాధ్యతలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంఈవో ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. 12 మంది సిబ్బంది ఉన్న కస్తూరిబాలో రోజూ ఎంఈవోతో పాటు పాత ఎస్‌వో కూడా సంతకాలు చేయడం విశేషం.
పాత ఎస్‌వో ఎంఈవోకు ఇంత వరకు రికార్డులను, వంట పాత్రలను కూడా అందజేయలేదు. బాలికలు వస్తే వారిని ఆకలితో ఉంచాల్సి వస్తుందన్న భయం ఒక వైపు.. నిల్వల రిజిస్టర్‌లు లేనిదే తహశీల్దారు కార్యాలయం నుంచి విడుదల ఆదేశాలు(ఆర్‌వో) రాదని మరోవైపు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్‌వీఎం పీవో ఈ సమస్యలను చక్కదిద్దడంలో విఫలమయ్యారు.
దీనిపై ఎంఈవో బోడం నాయుడును శుక్రవారం వివరణ కోరగా టీసీల కోసం లేఖ రాశామని, తనకు పాత ఎస్‌వో ఇంత వరకు రికార్డులు, ఇతర వస్తువులు అందజేయలేదని పేర్కొన్నారు. వాటిని ఆమె నుంచి తీసుకుని బాలికలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఆమె క్యాష్ పుస్తకం ఇస్తే సిబ్బంది జీతాలను కూడా చెల్లిస్తామన్నారు. ఏజెన్సీలోని అన్ని కస్తూర్బా పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.