
భార్యా పిల్లలతో శ్రీనివాసరెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శుక్రవారం ఉదయం ‘కేశవరెడ్డి’ బాధితుడొకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి భార్యా పిల్లలతో కలిసి సీఎం కలిసేందుకు వచ్చిన గంగుల శ్రీనివాసరెడ్డికి 10 రోజులైనా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో.. సీఎం నివాసం ఎదుట బలవన్మరణానికి యత్నించాడు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని అడ్డుకొని అతని వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీనివాసరెడ్డి ఇద్దరు పిల్లలు హృద్రోగంతో బాధపడుతున్నారు. వారికి చికిత్స చేయించడానికి డబ్బు లేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డికి అప్పుగా ఇచ్చిన రూ. 5 లక్షలను ఇప్పిస్తే.. వాటితో పిల్లలకు చికిత్స చేయించుకుంటానని అతడు వేడుకుంటున్నాడు.
2012లో కేశవరెడ్డి తన దగ్గర నుంచి 5 లక్షలు రూపాయలు అప్పుగా తీసుకున్నాడని బాధితుడు తెలిపాడు. తన పిల్లల చికిత్స కోసం డబ్బులు అవసరం కావడంతో అప్పు చెల్లించాలని కోరగా కేశవరెడ్డి స్పందించలేదని వాపోయారు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో తనగోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చానని చెప్పాడు. పదిరోజులైనా సీఎంను కలిసే అవకాశం రాకపోడంతో కలతచెంది ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిపాడు. కేశవరెడ్డి నుంచి తన డబ్బులు ఇప్పించాలని వేడుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.