సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతకు ప్రభుత్వ ఆదరణ కరువవుతోంది. రైతులందరికీ వడ్డీ లేని రుణాలిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్న సర్కార్.. అసలు రుణాలకే ఎసరు పెడుతోంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించకుండా.. కాగితాల్లో పురోగతిని చూపిస్తూ మాయ చేస్తోంది. ఫలితంగా రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి భారీగా నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ఏడాదీ జిల్లాలో సీజన్ ముగిసేనాటికి ఖరీఫ్ రుణ లక్ష్యం, పురోగతిని చూస్తే అసలు గుట్టు స్పష్టమవుతోంది.
భారీ లక్ష్యం
జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లా యంత్రాంగం రూ. 438.15 కోట్ల పంట రుణాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి రుణాల మంజూరు ప్రక్రియకు తెరలేపింది. సీజన్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతులు నూతనోత్సాహంతో పంటల సాగు పనులకు శ్రీకారం చుట్టారు. రుణాల కోసం బ్యాంకులకు పరుగెత్తారు. బ్యాంకులు ఎప్పటిలాగే ఉదాసీనత ప్రదర్శించడంతో లక్ష్యసాధన నీరుగారింది. కేవలం రూ.355.14 కోట్ల మేర రుణాలిచ్చారు. మిగతా రూ.83 కోట్లు రైతులకు అందలేదు. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో 80 శాతం పురోగతి సాధించినట్లు వ్యవసాయశాఖ గణాం కాలు చెబుతున్నాయి. సీజన్ ముగియడంతో ఇక మిగిలిపోయిన ఖరీఫ్ రుణా లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
కాకి లెక్కలు
పంట రుణాలపై బ్యాంకులు కాకి లెక్కలు చూపిస్తున్నాయి. వాస్తవంగా రైతులకిచ్చిన రుణాల కంటే రెన్యువల్ చేసినవే అధికభాగం ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 355.14 కోట్లు పంట రుణాలు పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నా.. వాస్తవంగా అందులో రూ.225.5 కోట్ల మేర రెన్యువల్ చేసినవే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రుణాలు రెన్యువల్ చేయడంతో ప్రభుత్వం నుంచి వచ్చే వడ్డీ రాయితీ వర్తింపు అనుమానమే. సాధారణంగా పంట రుణం తీసుకున్నప్పటి నుంచి నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లింపులు చేస్తేనే రైతులకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
ఎలాంటి చెల్లింపులు చేయకుండా రెన్యువల్ చేస్తే అందుకు సంబంధించి రావాల్సిన వడ్డీ రాయితీ వర్తించదు. బ్యాంకర్లు లక్ష్యసాధనలో భాగంగా రైతులకు వడ్డీ రాయితీపై స్పష్టత ఇవ్వకుండా రెన్యువల్ చేయడంతో రైతులు నష్టపోతున్నారని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
రబీ రుణ లక్ష్యం రూ.268 కోట్లు
ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలోని రైతులకు రూ.268 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం రబీ పనులు ప్రారంభమయ్యాయి. రైతులు ఎరువులు, విత్తనాల కోసం కార్యాలయాలకు వస్తున్నారు. ఈ సమయంలో పెట్టుబడుల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నారు. నిర్దేశించిన రబీ లక్ష్యాన్ని ఈ సీజన్లో ఏమేరకు సాధిస్తారో.. రైతులకు ఎంతమేరకు రుణాలు అందుతాయో వేచిచూడాల్సిందే.
అసలుకు ఎసరు!
Published Tue, Oct 8 2013 3:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement