దరికి రాని జీవన్‌దాన్ | Kidney transplantation is limited flew the aircraft both | Sakshi
Sakshi News home page

దరికి రాని జీవన్‌దాన్

Published Fri, Jan 1 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

దరికి రాని జీవన్‌దాన్

దరికి రాని జీవన్‌దాన్

ఉత్తరాంధ్రలో సౌకర్యాలు అంతంత మాత్రమే
కిడ్నీ మార్పిడి సేవలకే పరిమితం
పేదరోగుల తలకు మించిన భారం
కేజీహెచ్‌లో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటైతే ఎంతో సౌలభ్యం

 
మృత్యుముఖంలో ఉన్న రోగికి అతి కీలకమైన అంతర్గత శరీరభాగాలను దానం చేసి వారి ప్రాణం కాపాడే ఉదాత్త సంస్కారం నానాటికీ మనందరిలో పెంపొందుతోంది. అవయవదానంపై అవగాహన వృద్ధి కారణంగా చావుబతుకుల్లో ఉన్న ఎందరికో ఊపిరి నిలుస్తోంది. అయితే అందుకు తగ్గ సదుపాయాలు మనకు ఏమాత్రం అందుబాటులో ఉన్నాయన్నది ప్రశ్న. రాష్ట్రాభివృద్ధి శరవేగంగా సాగుతోందని చెప్పుకునే పాలకులు ఈ అంశంపై ప్రధానంగా దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది.
 
విశాఖపట్నం: ప్రాణాపాయంలో ఉన్న వారికి అవయవాలను (మరణానంతరం) దానం చేసి వారి ప్రాణ ం నిలపాలన్న ఆలోచన నానాటికీ ఊపందుకుంటోంది. తమవారు కనుమరుగైనా వారి అవయవాలను వేరొకరికి అందజేసి ‘పునర్జన్మ’ ప్రసాదించే మహోన్నత సంస్కారం మృతుల కుటుంబ సభ్యుల్లో పెంపొందుతోంది. అయితే ఎవరెవరిలో ఎంత ఔన్నత్యం ఉన్నా, అత్యధునాతన వైద్య, సాంకేతిక సౌకర్యాలు లేనిపక్షంలో ఇది ఆచరణ సాధ్యం కాదు కదా.. ఉత్తరాంధ్ర ఈ విషయంలోనే చాలా వెనుకబడి ఉంది. ఇన్నాళ్లూ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అవయవ మార్పిడి సదుపాయం ఉంది. ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో మూత్రపిండాల మార్పిడి ఒక్కటే జరుగుతోంది. 2002లో అక్కడ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స యూనిట్ ప్రారంభమయింది. కొద్దికాలం సర్జన్లు అందుబాటులో లేక శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఈ ఏడాది పునఃప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఐదు కిడ్నీ మార్పిడులు జరిగాయి. అవయవదానంపై చైతన్యం పెరుగుతున్న తరుణంలో కేజీహెచ్‌లోనూ మరణానంతరం (కెడావర్) అవయవాల సేకరణ యూనిట్ మంజూరు కోసం ప్రతిపాదించారు. ఏడాది నుంచి దీనికి అతీగతీ లేదు.

కేజీహెచ్‌లో గుండె, కాలేయ మార్పిడి విభాగాలున్నా ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, ఇతర సదుపాయాలు లేక ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. గుంటూరు  ప్రభుత్వాస్పత్రి మాదిరిగా ప్రభుత్వం పీపీపీ విధానంలో కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుని కార్డియోథొరాసిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాలకు ప్రైవేటు వైద్యులను రప్పించి అవయవ మార్పిడికి శ్రీకారం చుట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోగి బ్రెయిన్‌డెడ్ అయ్యాక కాలేయం, గుండె, కళ్లు, ఊపిరితిత్తులను తొలగించి అవసరమైన రోగికి నిర్ణీత సమయంలో అమరుస్తారు. ఆరోగ్యంగా ఉన్న వారు అవసరమైన తమ వారికి మూత్రపిండాలు, కాలేయంలో కొంతభాగాన్ని లైవ్ డొనేషన్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పటిదాకా విశాఖ నగరంలో కేర్ ఆస్పత్రిలో అవయవ మార్పిడి సర్జరీలు అధికంగా జరిగాయి. ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ అవయవ మార్పిడికి అనుమతులున్నా కిడ్నీ శస్త్రచికిత్సలకే మొగ్గు చూపుతున్నారు.

ఖర్చుతో కూడుకున్న పని..
అవయవ మార్పిడిలో జీవన్‌దాన్ ద్వారా అవయవాలు ఉచితంగానే సమకూరుస్తారు. అయితే మార్పిడి అనంతరం రోగి జీవితాంతం ఖరీదైన మందులు (ఇమ్యునో సర్‌ప్రాసెంట్స్) వాడాల్సి రావడంతో పేదలు అందుకోలేకపోతున్నారు. అంతేకాదు.. దాత నుంచి తీసిన అవయవాలను గంటల వ్యవధిలోనే చార్టర్డ్ ఫ్లైట్‌లో పంపాల్సి రావడం వల్ల లక్షల్లో ఖర్చవుతుంది. ఇది కూడా పేదలకు భారంగా మారుతోంది. ఫలితంగా కేవలం ధనవంతులు మాత్రమే దీనిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు.

త్వరలో కేజీహెచ్‌లో ప్రాంతీయ కేంద్రం..
ఈ నేపథ్యంలో కేజీహెచ్ అవయవ మార్పిడి యూనిట్ స్థాపనకు వీలుగా తొలిదశలో జీవన్‌దాన్ ప్రాంతీయ కేంద్రాన్ని నెఫ్రాలజీ విభాగంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం రెండు గదులు కేటాయించారు. అవయవ మార్పిడి యూనిట్ ప్రారంభమైతే కేజీహెచ్‌లో అన్నీ ఉచితంగానే జరుగుతాయి. జీవితాంతం ఆసుపత్రి ఉచితంగా మందులు అందజేస్తుంది. ఇది పేద రోగులకు వరంగా మారుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement