
'కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు'
తమ రాష్ట్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవహర శైలిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.
హైదరాబాద్: తమ రాష్ట్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవహర శైలిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై రవాణా పన్ను విధించాలనుకోవడం దారుణమని ఆరోపించారు. 2015 వరకు రవాణ పన్ను విధించకూడదని పునర్విభజన చట్టంలో ఉందని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు రవాణా పన్ను విధించడం ఏంత వరకు సబబు అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. అలాంటి ఆయన ఇలా వ్యవహరించడం తగదిని అచ్చెన్నాయుడి ఈ సందర్భంగా కేసీఆర్కు హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని అచ్చెన్నాయుడు విమర్శించారు.