అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వచ్చినప్పుడు దాన్ని అడ్డుకొని ఓడిస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజలను, పార్టీ నాయకులను మభ్యపెడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, కేఆర్ ఆమోస్, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. తన స్వార్ధం కోసం ప్రజలను చివరివరకు భ్రమల్లో ఉంచే ఎత్తుగడల్లో సీఎం వెళ్తున్నారని దుయ్యబట్టారు. ఇది సీమాంధ్రకే తీరని నష్టం అవుతుందని, ఈ విషయాన్ని అక్కడి ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో కోర్‌కమిటీలోపార్టీ పెద్దలతో, కేంద్ర మంత్రులతో అధిష్టానం తెలంగాణపై తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, ప్రక్రియకు సహకరిస్తానని ప్రకటిస్తూ బయటకు వచ్చాక సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం ఏమీ కాబోదని మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అయిపోతుందని తె రవెనుక చెబుతూ తనపబ్బం గడుపుకోవడానికి బయట ప్రజల్ని వంచిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రక్రియపై సీఎం క్రికెట్ పరిభాషనుపయోగించడం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ‘‘ఇది అధిష్టానాన్ని ధిక్కరించడమే. దీనివల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానానికి తెలుసు’’ అని యాదవరెడ్డి వ్యాఖ్యానించారు.
సగం ఇన్నింగ్స్ కే సీమాంధ్ర కాంగ్రెస్ బ్యాట్‌సమెన్లు ఆలౌట్ అయిపోయారు కనుక ఇక వారు ఆడేందుకు ఏమీలేదన్న విషయాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి గమనించాలన్నారు. రూల్‌సను అతిక్రమించి చివరిబంతి వరకు సీఎం ఆడాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సీఎం వైఖరి వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోందన్నారు. చివరకు విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరింపచేసుకొనే అవకాశం కూడా లేకుండా సీఎం చేస్తున్నారని, దీనివల్ల ఆప్రాంతం తీవ్రంగా నష్టపోకతప్పదన్నారు. సీమాంధ్రలో సమ్మెను తక్షణమే విరమింపచేయాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని ఆమోస్ పేర్కొన్నారు. ప్రయివేటు బస్సులు, కార్పొరేట్ స్కూళ్లను నడిపిస్తూ సామాన్యప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ సంస్థలను మూతవేయించడం సరికాదన్నారు.
ఏపీ ఎన్జీఓలు తమ సమస్యల గురించి ప్రస్తావించకుండా రాజకీయ నిర్ణయాలపై ప్రశ్నించడం విడూడరంగా ఉందన్నారు.రానున్న కాలంలో వారు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేయదల్చుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కొత్త రాజధానికి 4లక్షల కోట్లు కావాలని అడిగి ఇప్పుడు ఢిల్లీకి టీడీపీలోని సమైక్య, తెలంగాణ వాదులను తీసుకువెళ్లడంలోని ఆంతర్యమేమిటన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేసులకు, బెయిల్‌కు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఖండించారు.
సీఎం సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారు
Published Fri, Sep 27 2013 9:48 PM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement