
సీఎంగా కొనసాగే అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును వెనక్కు పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. కిరణ్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత కోల్పోయారని ఆయన తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని జేఏసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
కిరణ్ పాల్పడుతున్న రాజ్యాంగ ఉల్లంఘనను శాసనసభ సరిచేస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలే కాకుండా, సభలో మొత్తం ఎమ్మెల్యేలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. బిల్లుపై ఇంకా మాట్లాడడానికి అదనపు సమయం అడిగిన ముఖ్యమంత్రి ఆఖరి నిమిషాన ఈ విధంగా వ్యవహరించడం రాజ్యంగ వ్యతిరేకమన్నారు. కోదండరాం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి తన పరిధిని గుర్తించి వ్యవహరించాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు కాదు.
గణతంత్ర దినోత్సవాన జెండా ఎగరవేయడమే కాదు, రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలి.
రాజ్యాంగం బద్దంగానే తాము తెలంగాణ కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి, బీజేపీనేత సీహెచ్ విద్యాసాగరావు, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, అద్దంకి దయాకర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.