మరో మణిహారం మెట్రో | Kiran Kumar reddy inaugurates Metro Coach | Sakshi
Sakshi News home page

మరో మణిహారం మెట్రో

Published Thu, Oct 3 2013 5:03 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

Kiran Kumar reddy inaugurates Metro Coach

మోడల్ బోగీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
2015 మార్చి నాటికి పట్టాలపైకి రైలు

 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మెట్రోరైలు మరో మణిహారం అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభివర్ణించారు. కొరియాలోని హ్యుండాయ్ రోటన్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న మెట్రోరైలు నమూనా కోచ్(బోగీ)ను బుధవారం నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానఘాట్ వద్ద ప్రజల సందర్శనార్థం సీఎం ఆవిష్కరించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని ఎలక్ట్రానిక్ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.14 వేల కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు తొలిదశ 2015 మార్చి 31వ తేదీ నాటికి ప్రారంభమవుతుందని తెలిపారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు మెట్రోరైలు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 అంతకుముందు హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ ఎమ్‌డీ ఎన్‌వీఎస్ రెడ్డి ఈ కోచ్ విశేషాలను వివరించారు. ‘ఇది పూర్తి ఎయిర్ కండిషన్డ్ బోగీ. ప్రారంభంలో ఒక్కో రైలుకు మూడు బోగీలు ఉంటాయి. ఒక్కో రైల్లో వెయ్యిమంది వరకు ప్రయాణించవచ్చు. ప్రయాణీకుల సంఖ్య పెరిగిన కొద్దీ గరిష్టంగా ఆరు బోగీలు ఏర్పాటుచేస్తాం. నిలుచుని ప్రయాణించేవారికి ఎక్కువ స్థలం కేటాయించినందువల్ల ఒక్కో రైలులో 126 మంది కూర్చుని వెళితే, 848 మంది నిలుచుని ప్రయాణించాల్సి ఉంటుంది. రైలు సరాసరి వేగం గంటకు 33 కిలోమీటర్లు. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
 
 ప్యాసింజర్ అడ్రస్ సిస్టమ్ ద్వారా రైల్వేస్టేషన్ సమీపిస్తున్న విషయాన్ని, ఎటువైపు తలుపులు తెరుచుకుంటాయనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అన్ని కోచ్‌లలో సీసీటీవీలుంటాయి..’ అని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ  కోచ్‌ను నెలరోజులపాటు ప్ర జల సందర్శనార్థం నెక్లెస్ రోడ్డులో ఉంచుతామని, ఆ తరువాత అందరికీ అందుబాటులో ఉండేలా మరోస్థానంలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, కాసు వెంకటకృష్ణారెడ్డి, ఎల్ అండ్ టీ ఎమ్‌డీ గాడ్గిల్, హ్యుండాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 బోగీలో ఉండే సౌకర్యాలివే...
      24 రూట్ మ్యాప్‌లు    ఫుల్ ఏసీ
  12 ఎల్‌సీడీ టీవీలు
      మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్ సాకెట్లు
      వైఫై, ఇంటర్నెట్ సదుపాయం
      సీసీటీవీలతో నిరంతర నిఘా
     బోగీలో బ్యాటరీ బ్యాక్‌అప్ ఫుల్
      నిరంతరాయంగా ఎల్‌ఈడీ కాంతులు
      అగ్నిప్రమాదాల నివారణకు ఉపకరణాలు, ఆక్సీజన్ సిలిండర్లు
      వికలాంగులు, వృద్ధులు కూర్చునేందుకు అనువైన సీట్లు   ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్, ఆపరేషన్, పర్యవేక్షణ
      ఎమర్జెన్సీలోఆటోమేటిక్‌గా మోగే అలారం
  సమీపించే స్టేషన్ పేరును తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో తెలిపే ప్యాసింజర్ అడ్రస్ సిస్టం
  న్యుమాటిక్ ఎమర్జెన్సీ ఎయిర్‌బ్రేక్ వ్యవస్థతో కుదుపులు లేని ప్రయాణం
  బ్రేకులు వేసినపుడు విద్యుత్ ఉత్పత్తి జరిగి బోగీకి ఉపయోగపడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement