ఒరిగింది జీరో
అనంతపురం :
పైలీన్ సైక్లోన్‌ను ఆపలేకపోయా కానీ.. రాష్ట్ర విభజన సైక్లోన్‌ను మాత్రం ఆపే శక్తి తనకుందని ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆయన హయాంలో ‘అనంత’కు ఒరగబెట్టిందేమీ లేదు.
మంగళవారం లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మూడు సంవత్సరాల రెండున్నర నెలల పాలనకు తెరపడింది. ఆయన 12 పర్యాయాలు జిల్లాలో పర్యటించి 60 హామీలు ఇచ్చారు. ఇందులో రెండు మూడు హామీలు మాత్రమే అదీ పాక్షికంగా నిలబెట్టుకున్నారు. 1994, 1999 ఎన్నికల్లో ఘెర పరాజయం పాలై జీవశ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రతో తన రెక్కల కష్టంతో 2004 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకితెచ్చారు. 2009 ఎన్నికల్లో సైతం ఆయన ఒంటి చేత్తో అధికారాన్ని కట్టబెట్టారు. రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే 2009 సెప్టెంబరు 2న వైఎస్ అమరుడయ్యారు. ఆ తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన కె.రోశయ్యను కాంగ్రెస్ అధిష్టానం 2010 నవంబర్ 24న బలవంతంగా దించేసింది. ఆ స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని కూర్చోబెట్టింది. కిరణ్ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో జిల్లా నుంచి ఎన్.రఘువీరారెడ్డికి రెవెన్యూ శాఖ.. ఎస్.శైలజానాథ్‌కు ప్రాథమిక విద్య శాఖ దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ చివరిసారిగా డిసెంబర్ 23న అనంతపురంలో నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.
హామీల్లో ఘనం
సీఎంగా కిరణ్ జిల్లాలో పర్యటించిన ప్రతిసారీ హంద్రీ-నీవా సుజల స్రవంతి తొలి దశ ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని.. రెండో దశ ఆయకట్టుకు 2014లోగా నీళ్లందిస్తామని పదేపదే హామీ గుప్పించారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ-నీవా కాలువ ద్వారా 1.65 టీఎంసీలను మాత్రమే తరలించగలిగారు. ఆయన తొలి సారి రచ్చబండలో భాగంగా 2011 జనవరి 30న గార్లదిన్నెలో పర్యటించారు. ఆ సందర్భంలో పెనకచెర్ల-కత్రిమల మధ్య మధ్యపెన్నార్ డ్యాంపై రూ.16 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చి దానిని విస్మరించారు. కిరణ్ ఇచ్చిన 60 హామీలదీ అదే పరిస్థితి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో మన జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగితే కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు. కర్ణాటక భారీగా లబ్ధి పొందినా చూస్తుండిపోయారు. పెన్న అహోబిలం రిజర్వాయర్‌కు కనీసం పది టీఎంసీలను సాధించుకోవడంలో కూడా కిరణ్ సర్కారు విఫలమైంది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో మంత్రి మండలి రద్దయింది. దీంతో రఘువీరారెడ్డి, శైలజానాథ్ మాజీ మంత్రులయ్యారు. కాగా, కిరణ్ హయాంలో రఘువీరా, శైలజానాథ్‌లు జిల్లాకు చేకూర్చిన ప్రగతి కంటే వ్యక్తిగతంగానే ఎక్కువగా లబ్ధిపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.