సీఎం నోటీసు చెల్లదు: శ్రీధర్, గండ్ర
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను తిరస్కరించాలంటూ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌కు ఇచ్చిన నోటీసు చెల్లదని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులన్నారు. ‘ప్రభుత్వం తరఫున నోటీసివ్వాలంటే మంత్రివర్గంలో అందరి ఆమోదమూ ఉండాలి. అందుకు భిన్నంగా ఉన్న ఈ నోటీసును అనధికార తీర్మానంగానే భావించి తిరస్కరించండి’’ అని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు ఆరెపల్లి మోహన్, ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రవీణ్‌కుమార్, కె.శ్రీధర్, బాలూనాయక్, చిరుమర్తి లింగయ్య, ప్రతాప్‌రెడ్డిలతో కలసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.
కేబినెట్‌లో చర్చించకుండా ప్రభుత్వం తరపున నోటీసిచ్చే అధికారం ఆయనకు లేదన్నారు. అంతేగాక శాసనసభ నిబంధన 77 కింద ఆయన ఇచ్చిన నోటీసు రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద పంపిన బిల్లుకు వర్తించదన్నారు.
బిల్లును తిరస్కరించాలని చెబుతున్న కిరణ్, దానిపై చర్చించేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలంటూ రాష్ట్రపతిని ఎందుకు లేఖ రాసినట్టని ప్రశ్నించారు. పైగా ఆ లేఖలో కూడా ‘బిల్లు’ అని ప్రస్తావించారే తప్ప ముసాయిదా బిల్లని ఎక్కడా పేర్కొనలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలను మరింత రెచ్చగొట్టడానికే కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలి తప్ప తిరస్కరించాలనుకోవడం సరికాదన్నారు.