పుస్తకం రాస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజనలో సీఎంగా ఉన్న ఆయన పుస్తకం రాస్తున్నారు. విభజన సమయంలో తెరవెనుక సాగిన మంత్రాంగాలను తన పుస్తకంలో పొందుపరుస్తానని ఆయన వెల్లడించినట్టు ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది.
విభజనపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు అనుసరించిన ద్వంద్వ ప్రమాణాల గురించి ఇందులో వెల్లడించనున్నారు. ఇప్పటికు 400 పేజీల వరకు పూర్తిచేసినట్టు కిరణ్ తెలిపారు. ఎన్నికలు పూర్తైన తర్వాత ఆయన అమెరికా వెళ్లారు. ఆ సమయంలోనే ఈ పుస్తకం చాలావరకు రాసినట్టు సమాచారం. "ఆంధ్రప్రదేశ్ విభజన సమమంలో చోటుచేసుకున్న పరిణామాలన్నీ నాకు తెలుసు. రాజకీయ పార్టీలు, నాయకులు ఎలా వ్యవహరించారనే దానిపై డాక్యమెంటరీ ఎవిడిన్స్ నా దగ్గర ఉన్నాయి' అని కిరణ్ పేర్కొన్నారు.
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, యూపీఏ మంత్రులతో చర్చించిన విషయాలను ఈ పుస్తకంలో కిరణ్ వెల్లడించే అవకాశముందంటున్నారు. అలాగే పార్టీ హైకమాండ్ కు సీనియర్ నాయకులు పంపిన నివేదికల్లోని విషయాలను ఇందులో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ పుస్తకంతో కిరణ్ కుమార్ రెడ్డి సంచలనం సృష్టిస్తారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.