
ఏమార్చేందుకే కిరణ్ డ్రామా!
* హైకమాండ్ గీత దాటకుండా గీతోపదేశాలు
* అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసే అవకాశాన్ని కావాలనే కాలరాస్తున్నారు
* సభను సమావేశపరిచే అధికారం తన చేతిలోనే ఉన్నా విస్మరిస్తున్నారు
* తీర్మానం చేయకుండా రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలతో మోసం చేస్తున్నారు
* ‘కేబినెట్ నోట్’ను అసెంబ్లీలో వ్యతిరేకిద్దామంటూ ఇంతకాలం మభ్యపెట్టారు
* రాష్ట్రంలో ఉద్యోగుల సమ్మెను విరమింపజేశారు
* సమ్మె కొనసాగుతుంటే బీజేపీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చేది.. బిల్లు తెచ్చే సాహసం కాంగ్రెస్ చేసేది కాదు
* విభజన సజావుగా సాగేందుకే ఇలా.. అంతా అధిష్టానం స్కెచ్‌లో భాగమే.. రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ సమైక్యవాదుల నుంచి తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గీసిన గీతను దాటకుండా ప్రజలను ఏమార్చడమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారా? ఆయన వేస్తున్న ప్రతి అడుగు నిస్సందేహంగా ప్రజలను మోసపుచ్చేదిగా ఉన్నదని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లకు లేఖల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిన సీఎం.. తన పరిధిలో ఉన్న అసెంబ్లీ తీర్మానం విషయాన్ని దాటవేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న అపకీర్తిని మూటగట్టుకుంటున్నారని వారు గుర్తుచేస్తున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ చేపట్టిన విభజన ప్రక్రియకు ఎలాంటి అవరోధం కలగకుండా తన వంతు కృషి చేస్తూనే సమైక్యవాదినని ముద్ర వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖలు రాసే బదులు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ శాసనసభ ద్వారా తీర్మానం చేసి యావత్ దేశం దృష్టికి సమస్యను తీసుకువెళ్లే అవకాశాన్ని కిరణ్ కాలరాస్తున్నారని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు.
శాసనసభలో సమైక్య తీర్మానానికి మద్దతు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినా ముఖ్యమంత్రిలో చలనం లేకపోవడం కాంగ్రెస్ సీమాంధ్ర నేతలను కలవరపరుస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరినే కిరణ్ అవలంబిస్తున్నట్టున్నారనే అనుమానం కాంగ్రెస్‌లోని సమైక్యవాదుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి ఆంధ్రా భవన్‌లో దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఆయన దీక్ష విరమించేలోగా నయానో భయానో ఉద్యోగుల సమ్మె విరమింపజేయడం అన్నీ తమ అనుమానాలను బలపరుస్తున్నాయని సీమాంధ్రకు చెందిన మంత్రి ఒకరు పేర్కొన్నారు.
తీర్మానం చేస్తే తన సీటు పోతుందని కిరణ్ భయమా?
శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెడితే పార్టీ అధిష్టానం నుంచి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని కిరణ్‌కుమార్‌రెడ్డి భయపడుతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. విభజనకు ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం కిరణ్‌కు అప్పగించిందని.. అందువల్లే శాసనసభను సమావేశపరచి సమైక్య తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆయన ముందుకు రావడం లేదని కోస్తా జిల్లాకు చెందిన మంత్రి ఒకరు పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నోట్ వస్తుందని, దానికి వ్యతిరేకంగా తీర్మానం చేద్దామని ఇంతకాలం కాంగ్రెస్ నేతలను మభ్యపెడుతూ వచ్చిన సీఎం.. అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేసే అధికారం తనకే ఉన్నా పట్టించుకోకుండా లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
‘శాసనసభను సమావేశపరచడానికి ఇప్పుడు గవర్నర్ నోటిఫికేషన్‌తో కూడా పని లేదు. అసెంబ్లీని ఇప్పటిదాకా ప్రోరోగ్ చేయకపోవడం వల్ల వెంటనే దానిని సమావేపరిచేందుకు వీలుంది. కేంద్రంలో ముసాయిదా బిల్లు తయారయ్యే నాటికయినా అసెంబ్లీని సమావేశపరచేందుకు సీఎం సాహసించడం లేదు. అలా చేస్తే పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి గురై పదవిని కోల్పోవాల్సి వస్తుందని కిరణ్ భయపడుతున్నారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు.
వ్యామోహం లేకపోతే ఎందుకు రాజీనామా చేయలేదు?
కిరణ్ తనకు పదవీ వ్యామోహం లేదని తన సన్నిహితుల ద్వారా చెప్పిస్తున్నారని.. అదే నిజమైతే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత కూడా పదవిని పట్టుకుని వదిలి పెట్టకుండా దర్జాగా అధికార హోదా అనుభవిస్తూనే అడపా దడపా లేఖల పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. విభజన సంకేతాలు వస్తున్న దశలోనే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని.. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సాహసం చేసి ఉండేది కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర విభజన తీరు పట్ల జాతీయ పార్టీ బీజేపీ ఇప్పుడిప్పుడే ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో.. రాష్ట్రాన్ని విభజించాల్సిందేనంటూ చంద్రబాబు ఏకంగా ఢిల్లీలో దీక్ష చేయడం.. ఆయన దీక్ష ముగిసిన తెల్లారే ఉద్యోగ సంఘాల సమ్మెను విరమింపజేయడం అంతా హైకమాండ్ స్కెచ్‌లో భాగమేనని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఉద్యోగుల సమ్మె ఇంకా కొనసాగి ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ సాహసించేది కాదని, బీజేపీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.