‘కోడెల ట్యాక్స్‌’ను కక్కిస్తున్నారు! | Kodela Siva Prasada Rao And His Family Collects Funds Illegally | Sakshi
Sakshi News home page

‘కోడెల ట్యాక్స్‌’ను కక్కిస్తున్నారు!

Published Sun, Jun 2 2019 11:00 AM | Last Updated on Sun, Jun 2 2019 11:07 AM

Kodela Siva Prasada Rao And His Family Collects Funds Illegally - Sakshi

సాక్షి, గుంటూరు: అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమ అనుచరుల ద్వారా కోడెల కుమారుడు, కుమార్తెలు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కే ట్యాక్స్‌ (కోడెల ట్యాక్స్‌) పేరుతో వ్యాపారులు, అధికారులు, కాంట్రాక్టర్లు, రైతులతో సహా ఎవరినీ వదలకుండా అందరి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. అనేక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు తీసుకుని పట్టించుకోలేదు.

డబ్బులు వెనక్కు ఇవ్వకుండా తిప్పుతూ వచ్చారు. అదేమని అడిగితే అంతు చూస్తామంటూ కోడెల కుమారుడు, కుమార్తెల అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. తమకు అన్యాయం జరిగిందంటూ బాధితులు అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో వారిలో వారు కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుండిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. దీంతో గతంలో కోడెల ట్యాక్స్‌ పేరుతో వసూలు చేసిన డబ్బులు వెనక్కు ఇప్పించాలంటూ బాధితులు పోలీసుస్టేషన్లకు క్యూ కడుతున్నారు.

నిరుద్యోగుల ఫిర్యాదు
కోడెల కుమార్తె విజయలక్ష్మి ఆదేశించారంటూ నరసరావుపేటకు చెందిన టీడీపీ నాయకుడు రాంబాబు తమను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశారని, వాటిని  వెనక్కు ఇప్పించి న్యాయం చేయాలంటూ నరసరావుపేట మండలం కేశానుపల్లికి చెందిన ఓ బాధితుడు ఇటీవల నరసరావుపేట రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సదరు టీడీపీ నేతను పిలిచి విచారించడంతో మరుసటి రోజే వసూలు చేసిన రూ.10 లక్షలను వెనక్కు ఇచ్చేశారు. విషయం బయటకు తెలియడంతో అతనితోపాటు రూ.25 లక్షలు ఇచ్చిన వారు సైతం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సబ్‌స్టేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 17 మంది నిరుద్యోగుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున కోడెల కుమార్తె విజయలక్ష్మికి ఇవ్వాలంటూ టీడీపీ నేత రాంబాబు వసూలు చేసినట్లు సమాచారం.

అయితే వీరిలో తొమ్మిది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇప్పించగలిగారు. మిగతా ఎనిమిది మందికి ఉద్యోగం ఇప్పించకపోగా వారి వద్ద వసూలు చేసిన డబ్బులు సైతం వెనక్కు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. డబ్బులు వెనక్కు ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. శుక్రవారం  ఎనిమిది మంది నిరుద్యోగులు నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై వన్‌టౌన్‌ సీఐ బిలాలుద్దీన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వెలుగులోకి వస్తున్న ‘కోడెల’ అక్రమాలు...
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ బాధితునికి తాము నొక్కేసిన రూ.10 లక్షలను ‘కోడెల బ్యాచ్‌’  వెనక్కు ఇచ్చేశారనే వార్త బయటకు పొక్కింది. మిగిలిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ‘కోడెల’ అక్రమ దందాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు, కుమార్తె వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తే వాటిని కేసులుగా నమోదు చేసేందుకు ప్రత్యేక పోలీసు స్టేషన్‌లు.. వాటిని విచారించేందుకు ప్రత్యేక కోర్టులు పెట్టాల్సినంతమంది బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement