
కోడెల భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు చిత్రంలో కోడెల తనయుడు శివరామ్
సాక్షి, గుంటూరు/అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నరసరావుపేటలో నిర్వహించనున్నారు. కోడెల సోమవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన భౌతికాయాన్ని మంగళవారం రోడ్డు మార్గంలో గుంటూరు తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో అభిమానులు, టీడీపీ కార్యకర్తల సందర్శనార్థం కోడెల భౌతికకాయాన్ని ఉంచారు.
మాజీ స్పీకర్‌కు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ, చినరాజప్ప, జవహర్‌తోపాటు పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. కోడెల తనయుడు కోడెల శివరామ్‌ను నాయకులు పరామర్శించారు. అనంతరం భౌతిక కాయాన్ని సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటలోని కోడెల నివాసానికి తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా కోడెల అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. బుధవారం కోడెల అంత్యక్రియల నేపథ్యంలో నరసరావుపేటలో అమలులో ఉన్న 144వ సెక్షన్‌లో మినహాయింపు ఇస్తున్నట్టు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment