కర్నూలు : కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మారెప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిభావంతమైన నాయకత్వంతో తెలుగు ప్రజల అభిమానం పొందిన ఆదర్శ నేతగా కోట్ల విజయ భాస్కరరెడ్డి పేరు గడిస్తే ...ఆయన కుమారుడు కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి మాత్రం పదవి పట్టుకొని పాకులాడుతూ రాష్ట్ర విభజనకు కారణమవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం శోచనీయమని ఇప్పటికైనా మనసు మార్చుకొని రాజీనామా చేయాలని మారెప్ప డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు.