కొవ్వూరు యువకుడికి పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్
పశ్చిమగోదావరి(కొవ్వూరు): పువ్వు పుట్టగానే పరిమళించినట్టే.. ప్రతిభ కూడా చిన్నప్పుడే తెలిసిపోతుందని ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. చిన్నప్పుడు పాఠశాలలో ఏ పరరీక్ష నిర్వహించినా ముందుండే శేఖర్‌బాబు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ.. పీహెచ్‌డీలోనూ బంగారుపతకం సొంతం చేసుకున్నారు. ఓ వైపు ఐఎఫ్‌ఎస్ శిక్షణలో ఉంటూనే మరోవైపు కష్టపడి పీహెచ్‌డీ పూర్తిచేశారు. కొవ్వూరుకు చెందిన గెడ్డం శేఖర్‌బాబు కందిసాగులో అధిక దిగుబడి నిచ్చే జన్యువును కనుగొని పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ సాధించారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిపిన ఈ ప్రయోగానికి గాను.. న్యూఢీల్లీలో శుక్రవారం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆర్.చిందంబరం చేతుల మీదుగా బంగారుపతకాన్ని అందుకున్నారు. వ్యవసాయశాస్త్రంలో పీజీ పూర్తిచేసిన అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో మూడేళ్ల పాటు పీహెచ్‌డీ చేశారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్‌లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు.