సాక్షి, విజయవాడ: జిల్లాలోని రెడ్ జోన్లలో ప్రతీ చోట జియోగ్రాఫికల్ క్వారంటైన్‌ను అమలు చేస్తున్నామని కలెక్టర్ ఇంతీయాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక జిల్లా వ్యాప్తంగా 37 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నాయని, ఒక్క విజవాడ సిటీలోనే 20 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇక నూజివీడు, జగ్గయ్య పేట, నందిగామ, పెనమలూరు, మచిలీపట్నాలలో కొన్ని క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. కంటైన్మెంట్ క్లస్టర్‌లలో ఎటువంటి వెసులుబాటులు లేవన్నారు. అదే విధంగా రెడ్ జోన్ ప్రాంతాలలో పూర్తిగా రాకపోకలు నిషేధించామని, గ్రీన్ జోన్లలో కూడా నిబంధనలకు లోబడే వెసులుబాటు కల్పించామని ఆయన అన్నారు. (సత్ఫలితాలిస్తోన్న జియోగ్రాఫికల్ క్వారంటైన్..)
నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుత్రిలోని క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయన్నారు. పరిస్థితులకు అనుకూలంగా పరిశ్రమల నిర్వహణ జరుగుతుందని, మిర్చి కోతకు వచ్చిన 3800 మంది వలసకూలీలను ప్రత్యేక రైళ్లలో మహారాష్ట్రకు తరలించామన్నారు. మరో 2200 మందిని బస్సుల ద్వారా స్వగ్రామాలకు చేర్చామని తెలిపారు. మిగిలిన వారిని కూడా స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కలెక్టర్ పేర్కొన్నారు. (కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు!)
Comments
Please login to add a commentAdd a comment