సాక్షి, విజయవాడ : కృష్ణా, గుంటూరు జిల్లాలకు విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడాకు కొత్తగా నియమితులైన నలుగురు డెరైక్టర్లను నిలుపుదల చేస్తూ బుధవారం గవర్నరు ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆ నలుగురి పోస్టులు ఒక్కరోజులోనే ఊడిపోవడం రెండు జిల్లాలతో పాటు ఉడాలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చేవరకైనా ఈ కమిటీ ఉంటుందని ఉడా సిబ్బంది భావించారు. పదవి వచ్చిన ముచ్చట కూడా తీరకముందే ఒక్కరోజులోనే గవర్నరు వాటిని రద్దుచేశారు. ఒకవేళ వారు ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మే నెలాఖరు వరకు నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉండేది కాదు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే..
వీజీటీఎం ఉడాకు రెండేళ్లకొకసారి పాలకవర్గాన్ని మార్చవచ్చు. ఈ లెక్కన కాంగ్రెస్ ఐదేళ్ల హయాంలో కనీసం మూడు పాలకవర్గాలు మారేవి. అప్పుడు సుమారు 25 మందికి అవకాశం వచ్చేది. 2009లో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రులుగా ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉడా గురించి కాని, పాలకవర్గాల నియామకం గురించి కాని పట్టించుకోలేదు. దీంతో నాలుగున్నరేళ్లపాటు స్పెషల్ ఆఫీసర్ పాలనే సాగింది. గత ఏడాది జూన్‌లో ఉడా చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన వణుకూరి శ్రీనివాసరెడ్డిని నియమించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాస్త శ్రద్ధ
తీసుకుంటే మరికొంతమంది డెరైక్టర్లు వచ్చేవారు. వారు కొద్దొ గొప్పో ప్రయత్నిస్తే ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి ఉడా పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉండేవారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగానే ఉడాకు పూర్తి కాలం బోర్డును నియమించలేదు.
కిరణ్‌రెడ్డిపై ఆగ్రహం..
తమతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కిరణ్‌కుమార్‌రెడ్డి చాకిరి చేయించుకున్నారే తప్ప పదవులు ఇచ్చే విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపలేదని ఆ పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పార్టీ జెండాలు మోయడానికే పరిమితమయ్యామనే భావన వారిలో కనపడుతోంది. చివరికి పదవిలోంచి దిగిపోయే ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి మొక్కుబడిగా వేసిన కమిటీని కూడా గవర్నరు రద్దుచేశారని మండిపడుతున్నారు.
కిరణ్‌కు నిజంగానే డెరైక్టర్లపై ప్రేమ ఉంటే ముందుగానే పాలకవర్గాన్ని వేసిఉండేవారని అంటున్నారు. దుర్గగుడికి పాలకవర్గానికి ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా దేవాదాయ శాఖలో ఆమోదం లభించలేదు. ఒకవేళ ఆ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించినా అది కూడా రద్దయ్యేదన్న భావన నాయకుల్లో వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని, ఇక నామినేటెడ్ పదవులు తమకు అందని దాక్షే అవుతాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
ఏక్ దిన్‌కా సుల్తాన్
Published Thu, Mar 6 2014 12:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement