విష్ణు, వెల్లంపల్లికి ‘కిరణ్’ షాక్
- ఉడా నామినేటెడ్ కమిటీలో రాయపాటి వర్గానికి చోటు
- నలుగురు సభ్యులతో గవర్నింగ్ బాడీ
- జిల్లాకు దక్కని ప్రాతినిధ్యం
సాక్షి, విజయవాడ : విజయవాడ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావులకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి షాక్ ఇచ్చారు. చివరి వరకు తనతో ఉండి రాజీనామా తర్వాత వదిలేసిన ఎమ్మెల్యేలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఉడా గవర్నింగ్‌బాడీలో ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లను తొలగించి తనకు అండగా నిలబడిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గానికి కట్టబెట్టారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే కొన్ని గంటల ముందు వీజీటీఎం ఉడాకి గవర్నింగ్ బాడీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉడాకు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన వణుకూరు శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు.
పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం తన పదవీకాలం ముగుస్తున్న దశలో రాజపుత్ర సత్యంసింగ్, తాడికొండ సాంబశివరావు, ఎం,మల్లికార్జునరావు, నూకవరపు హరికృష్ణలను గవర్నింగ్ బాడీ సభ్యులుగా నియమించింది. వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌కే జోషి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. వీరిలో తాడికొండ సాంబశివరావు విజయవాడలో గత ఏడేళ్లుగా నివసిస్తున్నారు.
ఆయన రాయపాటి సాంబశివరావుకు బంధువని సమాచారం. సాంబశివరావు తప్ప మిగిలిన వారంతా గుంటూరు జిల్లాకు చెందినవారే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేవరకు పక్కనే ఉండి, గవర్నర్ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డికి దూరంగా జరిగిన విజయవాడ సెంట్రల్, పశ్చిమ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ పాత తేదీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వీరి నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కంగుతిన్న మల్లాది, వెల్లంపల్లి...
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుందేటి శ్యామ్ పేరును, వెల్లంపల్లి శ్రీనివాసరావు వక్కలగడ్డ శ్రీకాంత్ పేరును ఉడా కమిటీ కోసం సిఫార్సు చేసినట్లు తెలిసింది. చివరి వరకు జాబితాలో ఈ పేర్లు ఉన్నా జీవో వచ్చేసరికి లేకపోవడంతో వారు కంగుతిన్నారు. ఉడా పదవుల కోసం జిల్లా నుంచి పలువురు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. విజయవాడ నగర మాజీ అధ్యక్షుడు పైలా సోమినాయుడు ఉడా చైర్మన్ పదవి కోసం ఎంపీ లగడపాటితో కలిసి ప్రయత్నించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పదవిని గుంటూరు జిల్లాకు కట్టబెట్టారు. కనీసం ఉడా పాలకవర్గంలోనైనా చోటు దక్కుతుందని ఆశించిన జిల్లా కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురైంది. జిల్లాకు చెందిన నేతలు సొంత ప్రయోజనాలే చూసుకున్నారని, స్థానిక నేతల గురించి పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రాష్ట్రపతి పాలన విధిస్తున్న సమయంలో ఈ పాలకవర్గం వేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.