
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి అభివాదం చేస్తున్న నరసాపురం పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థులు, నాయకులు
సాక్షి, తాడేపల్లిగూడెం : చంద్రబాబుకు ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్టే అని, చంద్రబాబునాయుడును అబద్ధాలనాయుడు అంటే అతికినట్టు సరిపోతుందని కేంద్ర మాజీ మంత్రి యూవీ.కృష్ణంరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని మాగంటి కల్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ అబద్ధాల బాబు చంద్రబాబు అన్నారు. పోలవరం వరం మోడీదైతే బాబు తనదిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. పోలవరం నేనే తెచ్చానంటాడు. మోడీ, కేసీఆర్‌ను విమర్శిస్తుంటాడు తప్ప బాబుకు వేరే పనిలేదన్నారు. బీజేపీతో చంద్రబాబు ఎందుకు తగవు పెట్టుకున్నాడో అర్థంకాదన్నారు.
పోలవరానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన సొమ్ములను మింగేసి పనులు చేయకుండా కూడా మింగేసి వాటి గురించి ఆరా అడిగితే బీజేపీతో బాబు తగవుపెట్టుకున్నారన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 3.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. వీటిని దాచి అబద్ధాలు చెప్పే బాబుకు అబద్ధాల నాయుడు పేరు సరిపోతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవినీతి చేయకుండా బీజేపీ అడ్డుపడటం వల్ల టీడీపీ బీజేపీతో విడాకులు తీసుకుందన్నారు. పోలవరం ఖర్చు గురించి ఆరా అడిగినందుకే ఎన్‌డీఏ నుంచి బాబు బయటకు వచ్చారన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనైతిక రాజకీయం చేస్తుందన్నారు.
రాష్ట్రంలో ఇసుక లూటీ, బాక్సైట్ లూటీ, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి వాటితో పాలన పెచ్చరిల్లిందన్నారు. దుర్మార్గ చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం అన్నారు. త్వరలో ఆ పార్టీ సెలవు తీసుకుంటుందని జోస్యం చెప్పారు. బాబు కాపులను మోసం చేశారని, కులాల మధ్య చిచ్చుపెట్టిన సామాజిక ఉగ్రవాది చంద్రబాబే అన్నారు. టీడీపీకి ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, నీతికి, అవినీతికి మధ్య జరిగే పోరాటం అన్నారు. మార్పునకు ఈ ఎన్నికలు శ్రీకారం చుట్టబోతున్నాయన్నారు. అవినీతి భారతంగా దేశాన్ని తీర్చిదిద్ది మోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రభాగంలో నిలిపారన్నారు. చైనా, పాకిస్తాన్ దేశాలను ఖబడ్దార్ అంటున్నారన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ, ఈబీసీ రిజర్వేషన్లు, త్రిపుల్ తలాక్ బిల్లు వంటి వాటి ద్వారా మోదీ ఉక్కుమనిషిగా నిరూపించుకున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు మండలాలను రాష్ట్రంలో కలుపకపోతే పోలవరం నిర్మాణం జరిగేదా అన్నారు. స్టిక్కర్ బాబుగా మారిన చంద్రబాబు నాటకాలపై ప్రజల్లో అవగాహన ఉందన్నారు. బీజేపీని గెలిపించాలని కోరారు. అభ్యర్థులతో సంఘీభావం ప్రకటించారు. పార్టీ నాయకులు శరణాల మాలతీరాణి, పురిఘళ్ల రఘురాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈతకోట తాతాజీ, గమిని సుబ్బారావు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment