అమ్మను తలచి | kruthagnatha sabha conducted in nizamabad | Sakshi
Sakshi News home page

అమ్మను తలచి

Published Mon, Mar 3 2014 3:21 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

kruthagnatha sabha conducted in nizamabad

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:  నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశ వేణు అధ్యక్షతన జరిగిన సభకు పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఎంపీలు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, విప్, బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, పటాన్‌చెరు, గజ్వేల్ ఎమ్మెల్యేలు నందీశ్వర్‌గౌడ్, నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, అరుణతార, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, మా జీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

 డీఎస్ సభకు దూరంగా ఉన్న మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కామారెడ్డిలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నిర్వహించిన కృతజ్ఞత సభకు హాజరు కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో చర్చనీయాంశంగా మారింది. సభలో నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 ఉద్వేగంగా
 ఈ సభలో దాదాపు అందరు నేతల ప్రసంగాలు ఉద్వేగంతో కొనసాగాయి. ‘‘సోనియా తెలంగాణ ప్రజల దేవత.. తెలంగాణ ఇంటి ఇలవేల్పు సోనియా.. సోనియాకు తెలంగాణ సలాం.. అమరుల కుటుంబాలకు పాదాభివందనం.. వెయ్యిమంది అమరుల త్యాగఫలం ఈ కొత్త రాష్ట్రం.. అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం.. బిడ్డలను కోల్పోయిన తల్లులకు.. బిడ్డలుగా ఉంటాం’’ అని పేర్కొన్నారు. తెలంగాణ అమరుల ప్రాణత్యాగం సోనియాగాంధీని కదిలించందన్నారు.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల పోరాటం, ఆరాటం ఫలించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనమైనా.. కాకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని, ఇచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. పునర్‌నిర్మాణంలోనూ కాంగ్రెస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. తెలంగాణ రాష్ర్టం ఆవిర్భావం, ఉద్యమాలు, ఫలితాలు, సోనియాగాంధీతో జరిగిన సంప్రదింపులు, టీ-ఎంపీల చూపిన తెగువను డి.శ్రీ నివాస్ వివరించారు.

 చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డిలపై భగ్గు
 టీడీపీ నేత చంద్రబాబునాయుడు, మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిలపై టీ-కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు మొదటి నుంచి తెలంగాణకు అడ్డంకిగా మారారని, బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాల ఇచ్చినప్పుడే తెలంగాణను ఇచ్చి ఉంటే తెలంగాణలో వందలాది ప్రాణత్యాగాలు జరిగేవి కాదన్నారు. దేశంలోని రాష్ట్రాలు అన్ని తిరిగి తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ఎన్‌డీఏ హయాంలో తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబేనని.. ఆ పాపం ఊరికే పోదన్నారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి తల్లిలాంటి కాంగ్రెస్, సోనియాలను మోసం చేసి, అన్ని విధాలా బాగుపడ్డారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలంగాణ ప్రజల కష్టం, శ్రమలు వెంటాడుతాయని, ఏదో ఒక రోజు తెలంగాణ అమరుల ఉసురు తాకుతుందని పేర్కొన్నారు. టీ-బిల్లు విషయంలో బీజేపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడిందని సభలో నాయకులు ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు లేనేలేదు, కేవలం ఓటాన్ అకౌంట్ బిల్లు  మాత్రమే  ప్రవేశ పెట్టాలని పేర్కొన్న విషయమే ఇందుకు ఉదాహరణ అన్నారు.  

 సభకు ఎంపీ షెట్కార్, మాజీ మంత్రి దూరం
 నిజామాబాద్‌లో నిర్వహించిన ‘కృతజ్ఞత సభ’కు మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ గైర్హాజర్ కావడం, ఇదే సమయంలో కామారెడ్డిలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నిర్వహించిన సభకు హాజరు కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. సుదర్శన్‌రెడ్డి, డి.శ్రీనివాస్‌ల మధ్యన కొంతకాలంగా గ్రూపుల పోరు సాగుతున్న విషయం తెలిసిందే. వారి మధ్య విభేదాలు తాజాగా మరోసారి బహిర్గతమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement