మీకు జ్ఞానముందా..? | Kurnool Collector was angry at ABN Channel | Sakshi
Sakshi News home page

మీకు జ్ఞానముందా..?

Published Thu, Aug 24 2017 3:47 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

మీకు జ్ఞానముందా..? - Sakshi

మీకు జ్ఞానముందా..?

- వాస్తవం తెలుసుకోకుండా వార్త ఎలా ఇస్తారు..
‘ఏబీఎన్‌ చానల్‌పై కర్నూలు కలెక్టర్‌ ఆగ్రహం
పీవో అస్వస్థతకు గురైతే మరణించినట్లు బ్రేకింగ్‌ న్యూస్‌ ఇవ్వడంపై మండిపాటు  
 
కర్నూలు(అగ్రికల్చర్‌): నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన ఏబీఎన్‌ చానల్‌పై కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిసైడింగ్‌ అధికారి(పీవో) అస్వస్థతకు గురైతే.. ఏకంగా మరణించారంటూ ఏబీఎన్‌ చానల్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌ రావడంపై ఆయన మండిపడ్డారు. ‘అసలు మీకు జ్ఞానముందా? వాస్తవం తెలుసుకోకుండా బ్రేకింగ్‌ న్యూస్‌ ఎలా ఇస్తారంటూ..’ ఏబీఎన్‌ను నిలదీశారు. బుధవారం నంద్యాల మండలం పోలూరులోని పోలింగ్‌ కేంద్రం– 2లో పీవోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరెడ్డికి గుండెపోటు వచ్చింది.

దీంతో సిబ్బంది ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో కొద్దిసేపటికి ఆయన కోలుకున్నారు. అయితే ఏబీఎన్‌ చానల్‌లో మాత్రం గుండెపోటుతో ప్రిసైడింగ్‌ అధికారి మృతి అంటూ బ్రేకింగ్‌ న్యూస్‌ రావడంతో కలకలం రేగింది. కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యనారాయణ.. ఈ వార్తతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే వివరాలు ఆరా తీశారు. గుండెపోటుకు గురైన శ్రీనివాసరెడ్డి కోలుకున్నారన్న సమాచారం రావడంతో కలెక్టర్‌ వెంటనే ఏబీఎన్‌ చానల్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మీకు కొంచమైనా జ్ఞానముందా? వాస్తవాలు తెలుసుకోకుండా ఒక పీవో మరణించారని ఎలా బ్రేకింగ్‌ న్యూస్‌ ఇస్తారు? ఈ వార్త చూస్తే ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏం కావాలి? వార్త ఇచ్చేటప్పుడు వాస్తవాలు ధ్రువీకరించుకోవాలనే విషయం తెలియదా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవో కోలుకున్నట్లు వెంటనే బ్రేకింగ్‌ న్యూస్‌ ఇవ్వాలని ఏబీఎన్‌ చానల్‌ను ఆయన ఆదేశించారు. లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్‌ ఆగ్రహంతో ఖంగుతిన్న ఏబీఎన్‌ చానల్‌.. పీవో కోలుకున్నారంటూ ఆ తర్వాత స్క్రోలింగ్‌ ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement