ఫ్యాన్‌ సునామీ | Kurnool District Election Results LIVE Update and Winning Candidates | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌ సునామీ

Published Fri, May 24 2019 9:00 AM | Last Updated on Fri, May 24 2019 9:07 AM

Kurnool District Election Results LIVE Update and Winning Candidates - Sakshi

కౌంటింగ్‌ కేంద్రం వద్ద కార్యకర్తల సందడి

ఫ్యాన్‌ సునామీ సృష్టించింది. ఈ ఉధృతికి సైకిల్‌ అడ్రెస్‌ లేకుండా కొట్టుకుపోయింది. గ్లాస్‌ ముక్కలుచెక్కలుగా పగిలిపోయింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలను వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ‘కంచుకోట’లో తిరుగేలేదని బలంగా చాటిచెప్పింది. జిల్లా ప్రజలంతా విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టారు. రాజకీయాల్లో విలువల పరిరక్షణకు, ప్రజలందరి శ్రేయస్సు కోసం పరితపిస్తున్న జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచారు. జిల్లాలోని అన్ని స్థానాలను ఒక పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మే 23 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  కర్నూలు జిల్లా సరికొత్త చరిత్రను లిఖించింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ అన్నింటినీ గెలుచుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా చరిత్రలో తనదైన రికార్డును నమోదు చేసుకుంది. 2014 ఎన్నికల్లోనూ 14 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది. అలాగే  రెండు ఎంపీ సీట్లనూ కైవసం చేసుకుంది.  తదనంతరం ఇద్దరు ఎంపీలతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినప్పటికీ తామంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉన్నామంటూ జిల్లా ప్రజలు స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై తమకు అభిమానం తరిగిపోదని మరోసారి రుజువు చేశారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 14 అసెంబ్లీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీని రాజకీయ సమాధి చేసి.. వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టారు. మరోవైపు జిల్లా రాజకీయాలను తమ చేతుల్లో బంధించుకుని నడిపిన కోట్ల, కేఈ కుటుంబాలను రాజకీయ సమాధి చేశారు. ఈసారి కూడా రెండు పార్లమెంటు స్థానాలనూ వైఎస్సార్‌సీపీకే ప్రజలు కట్టబెట్టారు. మొదటి నుంచి 13 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ కనిపించినప్పటికీ కర్నూలులో మాత్రం విజయం దోబూచులాడింది. రౌండు రౌండుకు ఉత్కంఠ పెంచింది. చివరకు కర్నూలు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డా అని నిరూపించారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు డాక్టర్లలో ఎంపీగా  సంజీవ్‌కుమార్, కోడుమూరు ఎమ్మెల్యేగా సుధాకర్‌ గెలుపొందగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ సారి కాటసాని జిల్లాలోనే అత్యధికంగా 43,857 ఓట్ల మెజార్టీ సాధించారు. కౌంటింగ్‌ సందర్భంగా జిల్లాలో మొదటి ఫలితం ఆదోని అసెంబ్లీ స్థానానిది వెలువడగా..చివరి ఫలితం పాణ్యం స్థానానిది వెలువడింది. పోస్టల్‌ బ్యాలెట్ల నుంచి మొదలైన వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం చాలా నియోజకవర్గాల్లో చివరి రౌండ్‌వరకు కొనసాగుతూనే వచ్చింది. 


కోట్ల, కేఈ కుటుంబాలకు గుణపాఠం 
మొదటి నుంచి ఉప్పు–నిప్పుగా ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు తమ మధ్య విభేదాలు మరిచి తెలుగుదేశం పార్టీలో చేరాయి. కర్నూలు పార్లమెంటు నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేయగా.. పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు, డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌ పోటీ చేశారు. ముఖ్యంగా కోట్ల, కేఈ కుటుంబాలు కర్నూలు పార్లమెంటు పరిధిలో కలియతిరిగి.. గతంలో తమ వల్ల దెబ్బతిన్న కుటుంబాలు కలిసి పనిచేయాలని కోరారు. అయితే, వీరి వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చింది. ఈ కుటుంబాల రాజకీయాల వల్లనే కర్నూలు పార్లమెంటు వెనుకబడి ఉందన్న భావన వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి మరోసారి తమను మోసం చేసేందుకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఫలితంగా ఈ రెండు కుటుంబాలు పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ భారీ ఓటమిని గిఫ్టుగా ఇచ్చారు.  


గెలిచిన డాక్టర్లు 
కోడుమూరు నియోజకవర్గం నుంచి డెంటల్‌ డాక్టర్‌ జె. సుధాకర్, కర్నూలు పార్లమెంటు నుంచి డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ బరిలో నిలిచారు. ఇద్దరూ రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ప్రజాసేవ చేస్తారనే నమ్మకంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీట్లను కేటాయించింది. ఈ ఇద్దరూ రాజకీయ ఉద్దండులతోనే పోటీ పడ్డారు. కర్నూలు పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రి కోట్ల టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఆయనపై రాజకీయాలకు కొత్తగా వచ్చి పోటీ చేసిన సంజీవ్‌కుమార్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక కోడుమూరు నుంచి బరిలో ఉన్న డాక్టర్‌ సుధాకర్‌ కూడా రాజకీయాలకు కొత్తే. ఈ నియోజకవర్గంలో ఒకవైపు కోట్ల, మరోవైపు విష్ణువర్దన్‌ రెడ్డితో పాటు కొత్తకోట ప్రకాష్‌ రెడ్డికూడా టీడీపీలోనే ఉన్నారు. వీరందరూ మూకుమ్మడిగా టీడీపీ అభ్యర్థి అయిన రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రామాంజినేయులుకు మద్దతు పలికారు. అయితే, కోట్ల కుటుంబం నుంచి బయటకు వచ్చిన కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి, రిటైర్డు ఎస్‌ఈ కృష్ణారెడ్డి వంటి నేతలు వైఎస్సార్‌సీపీ వెంట నడిచారు. అటువంటి రాజకీయ ఉద్దండులను వీరందరూ కలిసి ఢీ కొట్టి వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ సమకూర్చారు. 

వరుసగా రెండోసారి... 
డోన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వరుసగా రెండోసారి  విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిసారి ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకున్న బుగ్గన డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు. రెండోసారి కూడా కేఈ ప్రతాప్‌పైనే  విజయం సాధించారు. ఇక ఆలూరు నుంచి కూడా గుమ్మనూరు జయరాం వరుసగా రెండోసారి గెలుపొందారు. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. 

వరుసగా రెండోసారి... 
డోన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వరుసగా రెండోసారి  విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిసారి ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకున్న బుగ్గన డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు. రెండోసారి కూడా కేఈ ప్రతాప్‌పైనే  విజయం సాధించారు. ఇక ఆలూరు నుంచి కూడా గుమ్మనూరు జయరాం వరుసగా రెండోసారి గెలుపొందారు. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. 

కాటసాని ఆరోసారి.. 
అతి చిన్నవయసు నుంచే ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చరిత్ర కాటసాని రాంభూపాల్‌రెడ్డిది. 1985, 1989, 1994, 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి పాణ్యం శాసనసభ్యునిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విధేయునిగా ఉన్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంపై పార్టీ అభిమానులు, పాణ్యం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నారాయణరెడ్డికి నివాళి 
జిల్లా చరిత్రలో పత్తికొండకు  ప్రత్యేక స్థానం ఉంది. కరువు పీడిత ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ను పోషించే ముఠా నాయకుల ఆగడాలను నిరోధించేందుకు చెరుకులపాడు నారాయణరెడ్డి చేసిన కృషి వెలకట్టలేనిది. ఆయన ప్రజలతో మమేకమైన తీరును చూసి ఎన్నికల్లో తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే కుట్రతో నారాయణరెడ్డిని అంతమొందించారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఆయన సతీమణి కంగాటి శ్రీదేవికి జిల్లాలో తొలి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయిస్తూ బహిరంగసభలో ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన కంగాటి శ్రీదేవి అలుపెరగని పోరాటం సాగించి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపు నారాయణరెడ్డికి ఘనమైన నివాళియేనని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. 

త్యాగానికి విజయ‘ఫలం’! 
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు మంత్రి పదవుల కోసం పాకులాడి,  నైతిక విలువలకు తిలోదకాలిచ్చి  పచ్చపార్టీలో చేరి మంత్రులుగా వెలగబెట్టిన నేతలకు బుద్ధి చెప్పేలా వ్యవహరించిన ఏకైక నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలకు కట్టుబడి తన ఎమ్మెల్సీ పదవిని తృణపాయంగా వదిలేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తద్వారా పార్టీ అభిమానుల్లో, ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆయన చేసిన త్యాగానికే విజయం వరించిందని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.  

గెలిచిన వారు వీరే..
అసెంబ్లీ
నియోజకవర్గం పేరు                 గెలిచిన అభ్యర్థి
ఆలూరు                               గుమ్మనూరు జయరాం
పాణ్యం                                  కాటసాని రామిరెడ్డి
డోన్‌                                     బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
మంత్రాలయం                       వై.బాలనాగి రెడ్డి
ఆదోని                                  వై.సాయి ప్రసాద్‌ రెడ్డి
ఆళ్లగడ్డ                                గంగుల బీజేంద్రా రెడ్డి
కోడుమూరు(ఎస్సీ)                డాక్టర్‌ సుధాకర్‌
నంద్యాల                              శిల్పా రవించంద్ర కిశోర్‌ రెడ్డి
ఎమ్మిగనూరు                       ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి
కర్నూలు                              హఫీజ్‌ ఖాన్‌
నందికొట్కూరు                      టి.ఆర్థర్‌
బనగానపల్లె                         కాటసాని రామిరెడ్డి
పత్తికొండ                             కంగాటి శ్రీదేవి
శ్రీశైలం                                 శిల్పా చక్రపాణి రెడ్డి

ఎంపీలు
కర్నూలు                            సింగరి సంజీవ్‌ కుమార్‌ 
నంద్యాల                             పోచా బ్రహ్మానందరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement