నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ప్రకటించకపోతే మరోసారి ఉద్యమం తప్పదని రాజధాని సాధన కమిటీ హెచ్చరించింది.
సాక్షి, కర్నూలు: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ప్రకటించకపోతే మరోసారి ఉద్యమం తప్పదని రాజధాని సాధన కమిటీ హెచ్చరించింది. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని వక్తలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కమిటీ ఆధ్వర్యంలో పొలికేక పేరిట నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.
అనంతరం ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థల అధినేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థినీ విద్యార్థులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు రాజధానికి మద్దతుగా పెద్ద ఎత్తున నినదించారు. రాజధాని సాధన కమిటీ కన్వీనర్ వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రముఖులు తమ గళం వినిపిం చారు. రాజధాని రాయలసీమ హక్కు అని స్పష్టం చేశారు.
ర్యాలీలో మైనార్టీ సంఘం నాయకులు అబ్దుల్ మజీద్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కల్కూర, రైతు సంఘం నాయకుడు బొజ్జా దశరథ రామిరెడ్డి, లీసా చైర్మన్ సంపత్, జనతాదల్ నాయకుడు పెద్దయ్య, విద్యార్థి సంఘం నాయకుడు శ్రీరాములు, న్యాయవాది తెర్నేటి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.