సాక్షి, తాడేపల్లి : ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును అప్పట్లో తెలుగు ప్రజల కోసం వదులుకున్నామని వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బుధవారం వెల్లడించారు. రాష్ట్ర విభజనానంతరం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు జ్యుడీషియల్ క్యాపిటల్ ప్రకటనతో రాయలసీమ ప్రజల కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారన్నారు. కర్నూలును స్మార్ట్‌సిటీలాంటి ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు రాయలసీమ వాళ్లను రౌడీలతో పోల్చుతూ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరల వద్ద టీడీపీ నేతలు నాలుగువేల ఎకరాలను కొన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు రావచ్చు అని చెప్పారని, అలా రావాలని నేను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర ఉన్నాయని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment