సైన్స్ పరికరాలు, ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తే విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారు. బోధనలో మెలకువలను శిక్షణ రూపంలో అందిస్తే ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
పాఠశాలల్లో ల్యాబ్‌లు లేవు.. పరికరాలూ లేవు
Published Wed, Sep 18 2013 3:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
చిలకలూరిపేట రూరల్, న్యూస్‌లైన్ : సైన్స్ పరికరాలు, ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తే విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారు. బోధనలో మెలకువలను శిక్షణ రూపంలో అందిస్తే ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థుల మెదడుకు పదును పెట్టాలంటే ప్రయోగశాలలు ఏర్పాటు చేసి శాస్త్రీయంగా విద్యాబోధన చేయాలని విద్యావంతులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వివిధ పాఠశాలల్లో ప్రయోగశాలలూ లేవు, పరికరాలు లేవు. మరికొన్ని చోట్ల ల్యాబ్‌ల కోసం ప్రత్యేక గదులు లేక శాస్త్రీయ బోధనకు అవకాశమే లేకుండా పోయింది.
ఉదాహరణకు చిలకలూరిపేట మండలాన్ని పరిశీలిస్తే... ఇక్కడ ఏడు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతులకు సంబంధించి 2,146 మంది విద్యార్థులు వున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లను విధిగా ఏర్పాటు చేసి భౌతిక, రసాయన, జీవశాస్త్రాలలో ప్రయోగాలతో కూడిన బోధన సాగించాలి. అయితే ప్రభుత్వం ల్యాబ్‌లకు కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో ఉపాధ్యాయులు నల్లబోర్డుపైనే చిత్రాలు గీసి వాటిని వివరిస్తూ బోధిస్తున్నారు. దీంతో ఆశించిన ఫలితాలు రావటం లేదని వాపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో 2010-11 విద్యాసంవత్సరానికి ఒక్కో పాఠశాలకు కేవలం ఐదు వేల రూపాయల వంతున సైన్స్‌ల్యాబ్‌ల కోసం పంపిణీ చేశారు. 2011-12లో అదనంగా రూ. 15వేలు మంజూరు చేశారు. ప్రయోగశాలల ఏర్పాటుకు గదులు లేకపోవటంతో ఉపాధ్యాయులు రసాయనాలు, చిన్న చిన్న పరికరాలు కొనుగోలు చేసేందుకే ఆ మొత్తాలను వెచ్చించారు. దీంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
మారిన పాఠ్యాంశాలు ... అందని శిక్షణ.. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 4,5,8,9 తరగతుల జీవ, భౌతిక, రసాయన శాస్త్ర పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నూతన సిలబస్ ప్రవేశపెట్టింది. గత సంవత్సరం 1,2,3,6,7 తరగతుల పాఠ్యాంశాల్లో మార్పు తీసుకువచ్చి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణను అందించారు. ఈ సంవత్సరం మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా ప్రయోగశాలలు లేకపోవటంతోపాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితిలో విద్యాబోధన ఎలా అని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించి. ప్రతి పాఠశాలకు ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.
Advertisement
Advertisement