తణుకు :ఇకపై ఆస్తులు విక్రయించాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. విధిగా పాన్ కార్డు ఉండాలంటూ సర్కారు నిబంధన విధించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పాన్‌కార్డు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్లు చేసేలా నిబంధనలు రూపొం దించారు. ఆదాయ పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు దీని ని ప్రవేశపెట్టినప్పటికీ సామాన్యులకు మాత్రం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకుని ఆదాయ పన్ను ఎగవేసే వారికి ఇక చెల్లు చీటీ పాడవచ్చని భావిస్తున్నారు. నల్లధనాన్ని బయటకు రప్పించడంతో పాటు ఆదాయ పన్ను పెంచుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఇకపై ఆస్తులు అమ్మినా, కొనుగోలు చేసినా తప్పనిసరిగా పాన్‌కార్డు సమర్పించాల్సి ఉం టుంది.
పాన్‌కార్డు నంబర్ ద్వారా క్రయ, విక్రయదారుల ఆర్థిక లావాదేవీలు బయటపడే విధంగా చట్టంలో మార్పులు చేశారు. ఇప్పటివరకు భూములు, ఇళ్ల క్రయ, విక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది ఆదాయపు పన్ను చెల్లించడం లేదు. రూ.లక్ష, అంతకన్నా ఎక్కువ విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు పాన్‌కార్డు వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రిజిస్ట్రేషన్ సమయంలో పాన్‌కార్డుతో పాటు ఫారం-61 కింద వివరాలు అందించేలా నమూనా రూపొం దించారు. క్రయ, విక్రయదారులు ఇద్దరూ పాన్‌కార్డు నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన పొందుపరిచారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి పాన్‌కార్డు లేకున్నా రిజిస్ట్రేషన్ చేయరు. నూతన విధానంలో ఎక్కడ రిజి స్ట్రేషన్ జరిగినా పాన్‌కార్డు ఆధారంగా ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలిసిపోతుంది. వారు సంబంధిత వ్యక్తి నుంచి ఆదాయ పన్ను రాబడతారు. తద్వారా సర్కారు ఆదాయం పెంచుతారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల ఆస్తులు విక్రయించే వారికి ఈ నిబంధన ప్రతిబంధకంగా మారనుంది.
పాన్‌కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్
Published Tue, May 12 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement