కళ్ల ముందే కన్నబిడ్డ దుర్మరణం | Lakshmana Rao dead by lorry accident | Sakshi
Sakshi News home page

కళ్ల ముందే కన్నబిడ్డ దుర్మరణం

Published Sat, Aug 16 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

కళ్ల ముందే కన్నబిడ్డ దుర్మరణం

కళ్ల ముందే కన్నబిడ్డ దుర్మరణం

పి.కోన వలస(పాచిపెంట): ఆ గిరిజన దంపతులకు ఒక్కడే కుమారుడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఐదో తరగతి చదువుకుంటున్న ఆ విద్యార్థి పాఠశాలలో జెండా పండగకి వెళ్తొస్తానని చెప్పి ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరి తల్లి కళ్లముందే దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని చాపరాయివలస గిరిజన గ్రామానికి చోడిపల్లి లింగు, సింగారమ్మ దంపతులకు లక్ష్మణ రావు అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. లింగు రోజుకూలీ కాగా సింగారమ్మ పి.కోనవలస చెక్‌పోస్టులో పాచిపని చేస్తుంటుంది.
 
అమ్మవలస ఎంపీపీ పాఠశాలలో లక్ష్మణరావు 5వతరగతి చదువుతున్నాడు. చాపరాయివలస గ్రామంనుంచి అమ్మవలస గ్రామానికి 4 కిలోమీ టర్ల దూరం. లక్ష్మణరావు ప్రతిరోజూ పాఠశాలకు నడుచుకుని వెళ్లి వస్తుంటాడు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో పాఠశాలలో నిర్వహించే జెండా పండగకు హాజరయ్యేందుకు నడుచుకుంటూ వస్తుండగా పి.కోనవలస చెక్‌పోస్ట్ దగ్గర సాలూరు నుంచి ఒడిశావైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చెక్‌పోస్టు దగ్గరే పనిచేస్తున్న తల్లికి విషయం తెలిసి ఒక్కసారిగా హతాశురాలైంది.
 
విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన గిరిజనులు సంఘటనా స్థలానికి చేరుకుని  కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న  ఆ తల్లిదండ్రుల రోదనను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. విద్యార్థి మరణ వార్త తెలుసుకున్న అమ్మవలస పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.జయ సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు అందరికంటే ముందు వచ్చేవాడని, మంచి డ్రాయింగ్స్ వేస్తూ చలాకీగా ఉండేవాడని గుర్తుచేసుకున్నారు.
 
లక్ష్మణరావు కుటుంబానికి  ప్రధానోపాధ్యాయురాలు, పాచిపెంట మండల విద్యాశాఖాధికారి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. పాచిపెంట హెడ్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి, విద్యార్థి  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి  తరలించారు. లారీ డ్రైవర్ పరారవడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement