
సాక్షి, తిరుమల: ఆదాయం పెంచుకునేందుకు తిరుమలలో ఇబ్బడిముబ్బడిగా ఇచ్చిన పెద్ద హోటళ్ల అనుమతులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(టీటీడీ) ఇరుకున పెట్టాయి. ప్రస్తుతం కొండపై 11 పెద్ద హోటళ్లు, 6 జనతా హోటళ్లు ఉన్నాయి. వీటికి ప్రతి మూడేళ్లకోసారి టీటీడీ టెండర్లు నిర్వహిస్తోంది. టెండర్ దక్కించుకున్నవారు ఎర్నింగ్ మనీ డిపాజిట్ రూ.10 లక్షలు, నెలసరి అద్దె మొత్తాన్ని ఆరు నెలలకు కలిపి టీటీడీకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కొన్ని హోటళ్ల నెలసరి అద్దె రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెరిగింది.
నెలకు రూ.20 లక్షల అద్దెతో హోటల్ ప్రారంభించిన తర్వాత ఆహార పదార్థాల ముడిసరుకు కొనుగోళ్లు, సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ చార్జీలు, నీటి బిల్లులు ఇలా నెలకు రూ.కోటి వరకు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు భక్తులపై భారం వేస్తున్నారు. పెద్ద హోటళ్లలో భోజనానికి రూ.250 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో పెద్ద హోటళ్ల ధరలు అధికంగా ఉన్నాయని, వాటిని సమీక్షించాలని ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలైంది. కేసు విచారణ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం హైకోర్టుకు హాజరై సమాధానమిచ్చారు. అధిక ధరలకు విక్రయించే హోటళ్లపై ఇప్పటికే రూ.లక్షల్లో జరిమానా వేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment