
పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న రూ.18.30 లక్షల విలువ చేసే 610 కిల్లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
10 మంది నిందితుల అరెస్టు
ముంచంగిపుట్టు : అక్రమంగా తరలిస్తున్న రూ.18.30 లక్షల విలువ చేసే 610 కిల్లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒక జీపు, బొలేరో, మూడు ద్విచక్రవాహనాలతో పాటు రూ.91 వేలు నగదును స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లక్ష్మిపురం ప్రాంతం నుండి జోలాపుట్టు వైపు ఏపీ 37 యూ 2909 జీపులో 400 కిలోల గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో లబ్బూరు జంక్షన్ వద్ద మాటు వేసి పట్టుకున్నామని స్థానిక ఎస్‌ఐ ఎస్.అరుణ్ కుమార్ గురువారం తెలిపారు.
గంజాయితో పాటు రూ.79 వేలు నగదు, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉదయం 10 గంటల సమయంలో కించాయిపుట్టు పంచాయతీ పెద్దాపుట్టు గ్రామ సమీపంలో పెదబయలు మండలం జామ్‌గూడ ప్రాంతం నుంచి ఒడిశాకు సీజీ 16 బీ1322 బొలేరో వాహనంలో తీసుకువెళ్తున్న మరో 210 కిలోల గంజాయిని కూడా పట్టుకున్నామని, దాంతో పాటు రూ.12 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తున్న ఒడిశా మల్కన్‌గిరి జిల్లాకు చెందిన బి.శంకర్ సాహు, సురేంద్రకుమార్ సాహు, సింహచలం పాత్రో, ముంచంగిపుట్టు, పెదబయలు ప్రాంతాలకు చెందిన జి.బలభద్రుడు, జి.కోములైచోన్, ఎం.బాబురావు, కె.ముధుబాబు, మధ్యప్రదేశ్‌కు చెందిన గణేష్ రాథోడ్, బీర్లా, నారయణ ప్రసాద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. జీపు యాజమాని గంగారావుతో పాటు బొలేరో డ్రైవర్ పరారీలో ఉన్నారని, ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. ఈ దాడుల్లో తహశీల్దార్ పి.ఎస్.శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఈశ్వరచంద్ర శర్మతో పాటు సుమారు 20 మంది సీఆర్‌పీఎఫ్, స్థానిక, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.