లారీలకు బ్రేక్‌లు | Larry Owners Strike Against New Vehicle Act | Sakshi
Sakshi News home page

లారీలకు బ్రేక్‌లు

Published Thu, Sep 19 2019 9:41 AM | Last Updated on Thu, Sep 19 2019 10:11 AM

Larry Owners Strike Against New Vehicle Act - Sakshi

లారీ పరిశ్రమకు అటు విజయవాడ తరువాతి స్థానం సాలూరుదే. పట్టణంలో అడుగడుగునా లారీలు... వాటిపై ఆధారపడిన ఎన్నో గ్యారేజీలు... మరిన్ని మెకానిక్‌ షెడ్లు... మనకు దర్శనమిస్తాయి. అంటే ఈ పరిశ్రమ ఎంతోమందికి భుక్తి కలిగిస్తోందన్నమాట. ఇప్పటికే పెరిగిన డీజిల్‌ధరలు... జీఎస్టీలు... పెరిగిపోతున్న ముడిసరకుల ధరలతో పరిశ్రమ కాస్తా కుంటుపడింది. ఒకప్పుడు దర్జాగా బతికిన యజమానులు కాస్తా నష్టాలతో కష్టాలపాలయ్యారు. అయినా ఇంకా కొందరు దానిపైనే ఆధారపడి కాలం నెట్టుకొస్తున్నారు. తద్వారా కొందరు బడుగులకు జీవన భృతి కలుగుతోంది. కానీ తాజాగా వచ్చిన కొత్త వాహన చట్టం ఆ పరిశ్రమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోంది. భారీ జరిమానాలతో నడపలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు ప్రాంతం లారీలకు ప్రసిద్ధి.. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వందలాది లారీలు సరుకు రవాణా చేస్తుంటాయి. వేలాది మంది ఇక్కడి లారీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మోటారు వెహికల్‌ చట్టంలోని నిబంధనల పుణ్యమాని నష్టాలు చవిచూస్తున్నారు. దీనికి నిరసనగా గురువారం దేశ వ్యాప్తం గా జరుగుతున్న లారీల బంద్‌లో పాలు పంచుకుం టున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ తరు వాత లారీలు అధికంగా సాలూరులోనే ఉన్నాయి. ఇక్కడ సుమారు 2500 లారీలుండగా వీటిలో సుమా రు 1500 లారీలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకే గాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరుకులను నిత్యం రవాణా చేస్తున్నాయి. ఈ లారీలను నడుపుతున్న డ్రైవర్లు, క్లీనర్లు, యజమానులు ఒక్క సాలూరు పట్టణంలోనే సుమా రు 10 వేలకుపైగా ఉన్నారు. దీనిపైనే ఆ కుటుంబా లు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరితో పాటు గ్రీజ్‌బాయ్‌లు, మెకానిక్‌లు తదితర మొత్తం 15 వేలకు పైగా  కుటుంబాలు సైతం వీటి ఆధారంగానే జీవిస్తున్నాయి.

ఇక్కడి లారీలనే ఇతర రాష్ట్రాల్లో అవసరాలకు కాంట్రాక్టర్లు, వినియోగదారులు తీసుకువెళుతుంటారు. ఈ లారీల ద్వారా బొగ్గు, బాయిల్డ్‌ రైస్, ఇనుము, మట్టి రవాణా అధికంగా ఉంటుంది. విశాఖపట్నంలోని గన్నవరం పోర్టు నుండి  బొగ్గు రవాణా అధికంగా జరుగుతుంది. ఒక లారీ ఒక రోజు ఆగితే  సుమారు రూ.6 వేల వరకు నష్టం ఉంటుందని లారీ యజమానులు చెబుతున్నారు. ఒక రోజు లారీ లు బంద్‌లోకి వెళితే సాలూరు పట్టణంలో అన్ని లారీలకు కలిపి సుమారు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లుతుందంటున్నారు.

వేధిస్తున్న కొత్త నిబంధనలు...
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మోటారు వెహికల్‌ చట్టం వల్ల అధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని లారీ యజమానులు ఆందోళన బాట పట్టారు. ఈ లారీలు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా కొత్త చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధిస్తుండటంతో లారీ యజమానులకు రానూపోనూ కిరాయి డబ్బులు ట్రాఫిక్‌ జరిమానాలకే సరిపోవడం లేదు. బీమా ప్రీమియం, జీఎస్టీలు వంటివి యజమానులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయనేది వారి వాదన. మోటారు వాహన చట్టంలో సవరణలు చేసి లారీలపై జరిమానాలు తగ్గించాలని, జీఎస్టీ మినహాయించాలనేది వారి ప్రధాన డిమాండ్‌. దానికోసం ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్ల అసోసియేషన్‌ మద్దతు తెలిపింది. ఫలితంగా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లే లారీలన్నీ సాలూరులోనే నిలిచిపోనున్నాయి. బుధవారమే కొన్ని లారీలు నిలిచిపోయాయి. సాలూరు శివారులో రోడ్డు పక్కన, పట్టణ లారీ అసోసియేషన్‌ కార్యాలయ ఆవరణలో భారీగా లారీలు నిలిచాయి. 

కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు..
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు పడుతున్నాం. లారీలు నడపడం కష్టం గా మారింది. ట్రాఫిక్‌ చట్టాల పేరుతో భారీగా జ రిమానాలు వేస్తున్నారు. ఇలా అయితే మరీ నష్టాల్లో కూరుకుపోతాం. ఇంతకుముందు రూ.500 లోపు జరిమానాలు ఉండగా ఇప్పుడు రూ.2500 కు తక్కువ కాకుండా ఫైన్‌లు వేస్తున్నారు. 
– అక్కేన అప్పారావు, లారీ యజమాని, సాలూరు

లారీ పరిశ్రమకు సడలింపునివ్వాలి..
కేంద్ర ప్రభుత్వం లారీ పరి శ్రమలకు కొన్ని సడలింపులివ్వాలి. లారీ లపై జరిమానాలు విధింపు తగ్గించాలి. జీఎస్టీ మినహాయింపులు ప్రకటించాలి. లేక పోతే అంతంత మాత్రంగా సాగుతున్న ఈ పరిశ్రమ మరింత కునారిల్లక తప్పదు.
– కర్రి మహేష్, సాలూరు లారీ ఓనర్ల సంఘం మాజీ జాయింట్‌ సెక్రటరీ, లారీ యజమాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement