
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీ నుంచి దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ ఆంధ్రా కేడర్‌కు చెందిన వారే. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాకు చెందిన ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ (బీటెక్) పూర్తి చేసి 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో పని చేసిన ఆయన సేవలను ప్రస్తుతం అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
అంచెలంచెలుగా..
► ఐఏఎస్ శిక్షణ పూర్తి కాగానే 1997లో కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా చేసిన ఆయన తర్వాత భద్రాచలం అసిస్టెంట్ కలెక్టర్‌గా వెళ్లారు.
► జూన్ 2000 నుంచి మెదక్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారిగా, ఆ తరువాత అదే జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించారు.
► జూన్ 2003 నుంచి నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత జాయింట్ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారిగా పని చేశారు.
► దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004–2005 మధ్య సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసి.. 2005 నుంచి 2007 వరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.
► ఆ సమయంలో ‘ఆపరేషన్ కొల్లేరు’ చేపట్టి వైఎస్ ఆదేశాల మేరకు అక్కడి పేదల జీవనాన్ని మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు.
► ఆ తరువాత ఈపీడీసీఎల్ సీఎండీగా, విశాఖ జిల్లా కలెక్టర్‌గా అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖలో పని చేస్తున్నారు.