ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం వెచ్చిస్తున్న నిధులు భారీగా దారి మళ్లుతున్నాయి. కొంతమంది ముఖ్యనేతలు ‘కళాజాతరల’ పేరుతో కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలను నొక్కేస్తున్నారు.
కళాజాతరల సాకుతో కోట్లను నొక్కేస్తున్న నేతలు
సాక్షి, ైెహదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం వెచ్చిస్తున్న నిధులు భారీగా దారి మళ్లుతున్నాయి. కొంతమంది ముఖ్యనేతలు ‘కళాజాతరల’ పేరుతో కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలను నొక్కేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చి అడ్డగోలుగా నిధులను మంజూరు చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. పొదుపు సాకుతో నాలుగో త్రైమాసికానికి ఉపకారవేతనాలు, మందులకు నిధులను నిలిపేసిన ఆర్థిక శాఖ ఈ జాతర్లకు మాత్రం ప్రజాధనాన్ని పందేరం చేస్తోంది. నాలుగు నెలల కాలానికి నెలకు రూ.15 కోట్ల చొప్పున రూ. 60 కోట్లను అదనంగా కేటాయించింది. ఇందులో రూ. 30 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. మిగతా రూ. 30 కోట్లను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా విడుదల చేయనుంది.
ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికల్లో ప్రచారం కంటే కళాజాతరల వంటి ఔట్‌డోర్ మీడియా ప్రచారం ద్వారానే నిధులు దండుకోవడం సులభమని భావించిన నేతలు అందుకు తగ్గట్టు పావులు కదుపుతున్నారు.
కళాజాతరల బృందాలు బుర్రకథలు, ఇతర కళారూపాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నాయి. ఇందుకయ్యే నిధులను మంజూరు చేయాలంటే ప్రదర్శనలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ సంతకం చేస్తే సరిపోతుంది.
దీంతో నామమాత్రంగా కొన్ని గ్రామాల్లోనే ప్రదర్శనలు నిర్వహించి రికార్డుల్లో మాత్రం చాలా గ్రామాల్లో నిర్వహించినట్లు చూపిస్తున్నారు.
కళాజాతర బృందాలకు చెల్లించాల్సిన నామమాత్రం డబ్బును వాటికి చెల్లించి, మిగతా డబ్బును కమీషన్ల రూపంలో నేతలకు ముట్టజెబుతున్నారు.