హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం అమలు చేస్తారు
సీమాంధ్ర ప్రజాప్రతినిధిగా కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదాన్ని విన్పిస్తున్నాడు. అయితే సీఎంగా కచ్చితంగా హైకమాండ్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని అమలు చేస్తాడు. అందులో సందేహం లేదు. గతంలో పశ్చిమబెంగాల్‌లో సుబ్రతోముఖర్జీ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఉంటూనే హోంమంత్రిగా కొనసాగారు. అప్పట్లో కోల్‌కతాలో ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఆయన హోంమంత్రిగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేవాడు. ఎన్‌ఎస్‌యూఐకి మాత్రం ఆ నాయకుల ద్వారా దరఖాస్తు చేయించి అనుమతించేవాడు. కిరణ్ కూడా అదే పని చేస్తున్నాడు. - పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్
సీఎం డూప్లికేట్ సమైక్యవాది
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డూప్లికేట్ సమైక్యవాది. కాంగ్రెస్ విభజన ఆలోచన చేసినప్పటినుంచి బిల్లు ఆమోదం పొందేవరకు ప్రతి ప్రక్రియ ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. అయినా సమైక్యాంధ్రకోసం పోరాడుతున్నట్లు చెప్పుకొనేందుకు సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు. సీఎంకు సమైక్యవాదం వినిపించాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు ఏ దశలోనైనా పదవికి రాజీనామా చేసేవారు. కానీ అదేమీ చేయలేదు. సమైక్యవాదం అంటూనే విభజనకు సహకరిస్తున్నారు. విభజన చరిత్రాత్మక తప్పిదం. అందుకే ైవె ఎస్సార్‌సీపీ సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతోంది. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ఉండదు కాబట్టే సమైక్య తీర్మానం పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్‌లో ఉంటే డిపాజిట్లూ రావని జేసీకి తెలుసు. ఇతర పార్టీల్లోకి వెళదామా? అనుకుంటే వైఎస్సార్‌సీపీ ఎప్పుడో తిరస్కరించింది. టీడీపీలోకైనా పోదామనుకుంటే పరిటాల సునీత ఒప్పుకోకపోవడంతో బాబూ వద్దన్నాడు.
- వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, గడికోట, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, బాలరాజు, సుచరిత, ఆదినారాయణరెడ్డి
కాంగ్రెస్ నన్ను ముద్దాయిని చేసింది
కాంగ్రెస్ పార్టీ నన్ను ముద్దాయిని చేసింది. కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న నాకు అన్యాయం చేసింది. ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగితే నాకు రాజకీయ భవిష్యత్తే ఉండదు. వైఎస్సార్‌సీపీలోనే చేరతా. - మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
సీఎం అడ్డుకుంటారనేది అపోహే
అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకుంటారన్నది అపోహే. అలాంటి పరిణామాలేవీ చోటుచేసుకోవు. ఉద్రిక్తతలకు తావిచ్చే ఇలాంటి అంశాలపై ప్రచారం జరిగినా మీడియా వాటికి అంత ప్రాధాన్యమివ్వరాదు. - మంత్రి శ్రీధర్‌బాబు
త్వరలోనే రెండు పీసీసీలు
రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగిసిన వెంటనే రెండు పీసీసీల ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా పీసీసీలను ఏర్పాటుచేసి ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. - మంత్రి పొన్నాల లక్ష్మయ్య
విభజన జరిగినా కాంగ్రెస్‌లోనే కొనసాగుతా
రాష్ట్ర విభజన జరిగినా నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. పార్టీని వీడేదిలేదు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరిగితే నా నియోజకవర్గ ప్రజల మనోభావాలను వెల్లడిస్తా. సమస్యలను చెబుతా. - మంత్రి మహీధర్‌రెడ్డి
బిల్లును అడ్డుకోవాలనే కుట్ర
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉండేందుకు సీమాంధ్రులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీలో బిల్లును చర్చకు రాకుండా చేసే ఎత్తుగడకు పాల్పడుతున్నారు.
- రాంరె డ్డి దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్ ఎమ్మెల్యే)
టి.టీడీపీ నేతలు పార్టీని బహిష్కరించాలి
తెలంగాణ వ్యతిరేకతను ప్రతి సందర్భంలోనూ బయటపెట్టుకుంటున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో కొనసాగుతున్న తెలంగాణ ప్రాంత నేతలు వెంటనే పార్టీ వీడాలి. ఆ పార్టీని తెలంగాణలో బహిష్కరించాలి.
- కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదెలు (టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు)