పదవి కోసం దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ పట్టుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ ఎంపికపై పీటముడి ఇంకా వీడలేదు. జేఏసీ కన్వీనర్‌గా ఉన్న స్వామిగౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరటంతో పాటు ఎమ్మెల్సీగా ఎన్నికవటంతో ఆ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ పదవి కోసం టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పోటీపడుతుండటంతో ఐదు నెలలుగా ఎంపికను వాయిదా వేశారు. తాజాగా శనివారం జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ ఎంపికను పూర్తిచేసి, ప్రకటించాలనుకున్న కమిటీ చైర్మన్ కోదండరాం ప్రయత్నం ఫలించలేదు.
దీంతో కన్వీనర్‌ను 2 రోజు ల్లో నిర్ణయిస్తామని ఆయన వాయిదా వేశారు. ఇంతకుముందు టీఎన్‌జీఓ అధ్యక్షుడే కన్వీనర్‌గా ఉన్నారు కాబట్టి.. ఆ పదవిని తనకే ఇవ్వాలని దేవీప్రసాద్ పట్టుపడుతున్నారు. జేఏసీ చైర్మన్‌తో పాటు కన్వీనర్ పదవి కూడా అగ్రవర్ణాలకే ఎలా ఇస్తారని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరితో కోదండరాం, కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరికీ సర్దిచెప్పి ఒప్పించటానికి కోదండరాం, మల్లేపల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కన్వీనర్ ఎంపికను మరోసారి వాయిదా వేస్తున్నట్లు కోదండరాం ప్రకటించారు. ఇదిలావుంటే.. టీ.జేఏసీ కన్వీనర్ పదవికి దేవీప్రసాద్ ఎంపికయ్యేలా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొంతకాలంగా పావులు కదుపుతున్నట్లు చెప్తున్నారు.