అసెంబ్లీ మీడియా పాయింట్
పార్టీ మారడం తేలిక కాదు: శైలజానాథ్
రాజకీయ నేతలు ప్రస్తుతం ఉన్న పార్టీ నుంచి మరో పార్టీలోకి మారటం అంత తేలిక కాదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ చెప్పారు. సోమవారం ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో లాబీల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని ఉద్దేశించి ఏంటి సార్ పార్టీ మారుతున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘రాజకీయ నాయకులు పార్టీ మారడం.. మీరు టీవీ చానల్ మారినంత తేలిక కాదు’’ అని బదులిచ్చారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు స్థానిక నేతలు సిద్ధంగా ఉండరని అన్నారు.
కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు లేవు: సత్యానందరావు
సీమాంధ్రలో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు లేవని ఆ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. విభజన ఆగినా కాంగ్రెస్ పరిస్థితి మెరుగు పడదన్నారు. తనకు వైఎస్సార్‌సీపీ, టీడీపీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయన్నారు. సీఎం కిరణ్ పార్టీ పెట్టేంత పరిస్థితి ఉండక పోవచ్చన్నారు.
ఐదు సిద్ధాంతాలు వినిపిస్తున్న టీడీపీ
టీడీపీ బీఏసీ సమావేశంలోనూ ద్వంద్వ వైఖరి అవలంభించింది. చంద్రబాబు రెండుకళ్లు, ఇద్దరు కొడుకులు, కొబ్బరి చిప్పల సిద్ధాంతం, సమన్యాయం అంటూ విచిత్ర వాదనలు వినిపిస్తే... ఆ పార్టీ నేతలు బీఏసీ సమావేశానికి వచ్చి ‘ఐదు సిద్ధాంతాలు’ వినిపించారు! అశోక గజపతిరాజు క్లారిటీ కావాలంటారు. పయ్యావుల కేశవ్ సమాచారమిస్తే చర్చిస్తామంటారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు బిల్లును తిప్పిపంపాలంటారు. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి, మోత్కుపల్లి టీ బిల్లును ఆమోదించాలంటారు. తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారా..?
- ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు (టీఆర్‌ఎస్)
సమైక్య తీర్మానం చేస్తే చర్చకు మేం సిద్ధం
టీడీ పీ నేతలకు దమ్ముంటే చంద్రబాబు వాదమేంటో స్పష్టంగా చెప్పించాలి. నాలుగేళ్ల క్రితం చనిపోయిన రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడటం మానుకుని, చంద్రబాబు విధానమేంటో వారు స్పష్టంగా చెప్పాలి. శాసనసభలో ‘సమైక్య తీర్మానం’ చేస్తే చర్చకు మేము సిద్ధం. వైఎస్సార్‌సీపీని విమర్శించే అర్హత టీడీపీకి లేదు. బీఏసీ సమావేశానికి టీడీపీ నుంచి ఆరుగురు వచ్చి ఆరు వైఖరులు చెప్పారు.
-శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలినేని, కె.శ్రీనివాసులు (వైఎస్సార్‌సీపీ)
వైఎస్సార్ సీపీ విభజన కోరుతోంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైకి సమైక్యం అని చెబుతున్నా... వాళ్లు విభజన కోరుకుంటున్నారు. వారు కోరినట్లుగా ఆర్టికల్-3 ప్రకారం బిల్లు వచ్చింది. టీడీపీ కూడా 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణ వాదాన్ని భుజానికెత్తుకుంది. ఇప్పటికీ చంద్రబాబు రాజకీయ అనిశ్చితిని కొనసాగిస్తున్నారు. సభలో చర్చ జరగకపోతే ప్రజల అభిప్రాయాలను ఎలా చెబుతారు? బంద్‌లు, ధర్నాల ద్వారా చెబుతారా?
-జయప్రకాష్ నారాయణ్, లోక్‌సత్తా
బాబు వాదమే జేపీ ఎజెండా
చంద్రబాబు ఎజెండాను మోయడమే లక్ష్యంగా లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ పని చేస్తున్నారు. జేపీ కూడా ‘సమైక్య’ ‘ప్రత్యేక’ వాదాలలో దేన్నీ స్పష్టంగా చెప్పడంలేదు. చీకట్లో చంద్రబాబును, ఈనాడు అధినేత రామోజీరావును కలిసి వారి లక్ష్యం కోసమే పనిచేస్తున్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు మేం వ్యవహరిస్తున్నాం. రాజకీయంగా జరిగే నష్టాన్ని పట్టించుకోకుండా ఒకే విధానానికి కట్టుబడి ఉన్న మమ్మల్ని విమర్శించే అర్హత జేపీకి లేదు. మేధావినంటూ ఒకరికి కొమ్ముకాస్తున్న జేపీని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
- గొల్ల బాబూరావు, జి.శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు (వైఎస్సార్‌సీపీ)