విశ్వ రహస్యాలు తెలుసుకోండి
ఇస్రో శాస్త్రవేత్త నాగేశ్వరరావు
పులివెందుల టౌన్ :
విద్యార్థులు పలు ప్రయోగాలు చేసి వాటి ద్వార విశ్వరహస్యాలు తెలుసుకోవాలని బెంగుళూరు ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) శాస్త్రవేత్త పి.నాగేశ్వరరావు సూచించారు. లయోలా డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న సైన్స్ ఇన్‌స్పైర్ శిబిరంలో భాగంగా మూడో రోజైన శనివారం ఆయన పాల్గొని విద్యార్థులకు బోధించారు. ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రాలపై జరుగుతున్న పరిశోధనలపై అనేక విషయాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాలతో విశ్వ రహస్యాలు తెలుసుకోవాలన్నారు. విశ్వ రహస్యాలు, విశ్వం ఏర్పడిన విధానం, విశ్వం వయస్సు, భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా తెలిపారు. ఖగోళ శాస్త్రం అభివృద్ధి - భారతదేశం పాత్ర గురించి చెప్పారు. విశ్వంలో జరిగే మార్పులు, బయో ఆస్ట్రానమీ అంటే భూమి మీద జీవులు పుట్టుక నుంచి నేటి వరకు ఇస్రో చేసిన, చేస్తున్న కృషి గురించి ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివరించారు. అలాగే మామ్(మార్జి అర్బిటల్ మిషన్), ఖగోళ శాస్త్రాలపై కూడా వివరించారు.
విద్యార్థుల సందే హాలకు సమాధానమిచ్చి వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ముందుగా విద్యార్థులు భౌతిక, రసాయన, బాటనీ, జువాలజీ, జియాలజీలతో పాటు వివిధ అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు. సాయంత్రం హైదరాబాద్ జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త వి.శేషసాయి విద్యార్థులకు భూమి పుట్టుక నుంచి నేటి వరకు ఏర్పడిన వివిధ రకాల శిలలు, ఆర్థిక ఖనిజాలు, జీవుల గురించి వివరించారు.
యువ శాస్త్రవేత్తలు పలు విషయాలపై పరిశోధన చేసి దేశ పురోగతిని సాధించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. శాస్త్ర విజ్ఞానంలో నిష్ణాతులు కావాలన్నారు. యువ శాస్త్రవేత్తలు దేశానికి ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. కావున పరిశోధనా రంగంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పైర్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ అమల్‌రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.