ఏడాదిన్నరగా ఎన్నో ఒడిదొడుకులు.. అవాంతరాలు ఎదుర్కొన్న మినీ పాస్‌పోర్ట్ కేంద్రం బాలారిష్టాలు దాటి ప్రారంభానికి ముస్తాబైంది. పనుల తీరుతో అసలు కేంద్రం ఏర్పాటవుతుందా..? అనే అనుమానాలను దాటి ఎట్టకేలకు సిద్ధమైంది. శనివారం కేంద్ర రహదారుల శాఖ మంత్రి సర్వే సత్యనారాయణ ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : జిల్లా ప్రజలు పాస్‌పోర్టు కోసం హైదరాబాద్ దాకా వెళ్లి ప్రయాసలు పడుతుండడంతో ప్రభుత్వం స్పందించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో దరఖాస్తుల స్వీకరణ కార్యాలయాన్ని గతంలో ఏర్పాటు చేసింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి ఇక్కడే దరఖాస్తు చేసుకునేవారు. కొన్నాళ్లు సజావుగానే సేవలందించిన ఈ కార్యాలయాన్ని 2011 జనవరిలో ఎత్తేశారు. జిల్లావాసులు నిజామాబాద్‌లోని మినీ పాస్‌పోర్టు కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల డిమాండ్, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు 2012 ఆగస్టులో కరీంనగర్‌కు మినీ పాస్‌పోర్టు కేంద్రం మంజూరు చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
శాశ్వత భవనం నిర్మించేవరకు కార్యాలయం తాత్కాలిక నిర్వహణ కోసం అధికారులు అనువైన స్థలాలు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని కార్పొరేషన్‌కు చెందిన కాంప్లెక్స్‌ను ఎంపిక చేశారు. ప్రతీనెలా రూ.20 వేల అద్దె చెల్లింపునకు అంగీకరించి, భవన సుందరీకరణకు, ఎలక్ట్రిసిటీ పనులకు పాసుపోర్టు కార్యాలయం నుంచి రూ.18 లక్షలు మంజూరు చేస్తూ కార్పొరేషన్ కమిషనర్‌కు ఆధునికీకరణ బాధ్యతలు అప్పగించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసి తమకు అప్పగించాలని సూచించారు.
ఏడాదిన్నరగా ఎదురుచూపులే
ఆధునికీకరణ పనులు రెండు నెలలు, కంప్యూటర్, ఫర్నిచర్ ఏర్పాటు మరో రెండు నెలల్లో పూర్తి చేసి 2013 జనవరిలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను కాంట్రాక్టర్ ఏడాదిన్నరపాటు కొనసాగించాడు. మధ్యలో పలుమార్లు ప్రారంభ తేదీలు ప్రకటించి దాటవేశారు. అధికారుల పర్యవేక్షణలోపం, కాంట్రాక్టర్ అలసత్వంపై ప్రజాప్రతినిధులు, అధికారులు పలుసార్లు మండిపడ్డారు.
సాక్షి ఫోకస్
మినీ పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటులో నిర్లక్ష్యంపై సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. కేంద్రం లేక జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. స్పందించిన అధికారులు పనులు త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పనులు పూర్తి చేసి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
తగ్గనున్న దూరాభారం
ఇన్నాళ్లు పాస్‌పోర్టుకోసం తిప్పలు పడ్డ ప్రజలకు ఊరట లభించింది. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకు పెరుగుతోంది. అనేక మంది జిల్లా వాసులు ఉన్నత చదువులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకోసం విదేశాల బాట పడుతున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్, మలేషియా బాట పడుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువే. విద్యా, ఉద్యోగ రంగం కంటే బతుకుదెరువుకోసం కూలీలుగా వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. వీరు ఇప్పటిదాకా నిజామాబాద్ వెళ్లి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేంది. ఇక నుంచి జిల్లా కేంద్రంలోనే పాస్‌పోర్టు పొందే అవకాశం ఉండడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
ఎట్టకేలకు ‘పాస్‌పోర్టు’
Published Sat, Feb 8 2014 3:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement