
మృతుల కుటుంబాలను ఆదుకుందాం: వైఎస్ జగన్
శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాట్లాడేందుకు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ''శాంతిభద్రతలపై చర్చను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పరిటాల రవీంద్ర హత్య కేసు విషయంలో విచారణలు జరిగాయి. అందులో తాను చేసినవి సత్యదూరమైన ఆరోపణలని చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే ఆయన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు టికెట్లు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. పరిటాల రవీంద్ర హత్య విషయంలో వచ్చిన ఆరోపణలు నిజమే అయితే ఆయనలా చేస్తారా?
కేవలం చర్చను తప్పుదోవ పట్టించడానికే లేనిపోని అభాండాలు వేస్తున్నారు. వాళ్లు పరిటాల రవి అంటే, మావాళ్లు వంగవీటి మోహనరంగా అంటారు. ఇలా అంటుంటే ఇంకా ఎంత దూరమైనా వెళ్తుంది. వాళ్లను ఆ ప్రస్తావన మానమనండి, మావాళ్లు ఈ ప్రస్తావన మానేస్తారు. చనిపోయిన 14 మంది కుటుంబాలకు ఏదైనా మేలు చేయడానికి ప్రయత్నిద్దాం. మనకు ఎవరైనా తెలియనివాళ్లయినా సరే.. మనుషులు చనిపోతే కొంతమందికి ఐదు లక్షలు, మరికొందరికి ఇంకా ఎక్కువగా ఎక్స్గ్రేషియాలు ఇస్తున్నాం. ఇక్కడ మాత్రం ఓ పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులను వరుసపెట్టి హతమారుస్తున్నారు. ఇక్కడ వ్యవస్థలో మార్పు రావాలి. రేపు అధికారంలోకి మేమొస్తాం. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ హత్యారాజకీయాలను మానుకోవాలని అందరికీ సలహా ఇస్తున్నా'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.