హంతకులు, స్మగ్లర్లు అంటారా?
శాంతిభద్రతలపై జరిగిన చర్చ అసెంబ్లీలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసింది. అధికారపక్షం సభ్యులు సంయమనం కోల్పోయి వ్యవహరించి.. నోటికి వచ్చినట్లల్లా వ్యాఖ్యానించారు. దాంతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనను నరరూప రాక్షసుడని అన్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను స్మగ్లర్లుగా అభివర్ణించారని, ఇదే నిండు సభలో తనను హంతకుడని కూడా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. తనను, తన పార్టీ వాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వాళ్లు ఉపసంహరించుకుంటే.. తాను కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని చెప్పారు.
టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు చేసిన వ్యాఖ్యలమీద వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోడియంలోకి రావడంతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ చర్చ జరిగింది. సభలో లేని దివంగత నేతలను కించపరిచేలా అధికారపక్షం వ్యాఖ్యలు చేస్తోందని, వైఎస్ఆర్, వైఎస్ జగన్ లక్ష్యంగా అధికారపక్షం వ్యాఖ్యలు చేస్తోందని విపక్ష సభ్యులు మండిపడ్డారు. మరోవైపు అధికార పక్షం కూడా వెల్లోకి దూసుకొచ్చి పోటాపోటీగా నినాదాలు చేయడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను శనివారానికి వాయిదా వేశారు.