ప్రాణం ఖరీదు రూ.350
- అప్పు తీర్చలేదని కృష్ణానదిలో పడవేసిన వైనం
- మద్యం మత్తులో ఇద్దరు యువకుల ఘాతుకం
తాడేపల్లి రూరల్: ఓ నిండు ప్రాణం ఖరీదు అక్షరాలా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే! బాకీ సొమ్ము ఇవ్వనందుకు ఒక యువకుడిపై ఇద్దరు కలిసి దాడిచేయడమే కాకుండా, కాళ్లూచేతులూ పట్టుకుని కృష్ణా నదిలోకి పడవేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల మండలం యనమలవారిపల్లెకు చెందిన కనగతల మోహన్‌రెడ్డి, నెల్లూరు జిల్లా డక్కలి మండలం వడ్లమానుపాడు గ్రామానికి చెందిన రావూరి వెంకటసుబ్బయ్య అలియాస్ బాల్‌రెడ్డిలు విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద క్యాటరింగ్ పనులు చేస్తుంటారు.
వీరితోపాటు పవన్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఈ ముగ్గురూ స్నేహితులయ్యారు. ఈ క్రమంలో పవన్ తన అవసరాల నిమిత్తం మోహన్‌రెడ్డి వద్ద రూ.350 అప్పు తీసుకున్నాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ముగ్గురూ మద్యం తాగేందుకుగాను ఉండవల్లి సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ఫూటుగా తాగి తిరిగి వెళుతుండగా ప్రకాశం బ్యారేజి వద్దకు వచ్చేసరికి డబ్బుల విషయమై మోహన్‌రెడ్డి, పవన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమం లో మోహన్‌రెడ్డి, వెంకటసుబ్బయ్యలు పవన్‌పై దాడికి పాల్పడ్డారు.
ఈ విషయాన్ని గమనించిన అవుట్ పోస్టు వద్ద ఉన్న కానిస్టేబుల్ వారిని సముదాయించి అక్కడ నుంచి పంపించివేశారు. ముగ్గురూ ప్రకాశం బ్యారేజి 20వ ఖానా వద్దకు వచ్చేసరికి వారి మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. దీంతో మోహన్‌రెడ్డి, వెంకటసుబ్బయ్యలు పవన్‌పై దాడికి పాల్పడడమే కాకుండా కాళ్లూచేతులూ పట్టుకుని కృష్ణా నదిలోకి విసిరేశారు. దీంతో పవన్ బ్యారేజి గేట్లపై పడి మృతి చెందాడు. దీంతో అక్కడ నుంచి ఇద్దరూ పారిపోతుండగా వాహనాలపై వెళుతున్నవారు మోహన్‌రెడ్డిని పట్టుకున్నారు. వెంకటసుబ్బయ్య దిగువ భాగంలో ఉన్న కృష్ణానది తొట్లలోకి దూకి అక్కడ నుంచి రైల్వే బ్రిడ్జి వైపునకు ఈదుకుంటూ పోతుండగా తాడేపల్లి పోలీసులు పట్టుకున్నారు.
సంఘటనాస్థలాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ..
సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్, నార్త్ జోన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అవుట్ పోస్టు సీసీ కెమెరాల్లో పుటేజీని పరిశీలించారు. ఎస్పీ ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ సభ్యులు.. మృతదేహం పడి ఉన్న ప్రాంతానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. నిందితులు మోహన్‌రెడ్డి, వెంకటసుబ్బయ్యలను తాడేపల్లి ఎస్‌ఐ డి.నరేష్‌కుమార్ అదుపులోకి తీసుకున్నారు. అవుట్‌పోస్టు కానిస్టేబుల్ కంచారావు విశ్వసదన్ ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పవన్ పూర్తి వివరాలు తెలియరాలేదు.