
ప్రాణం తీసిన స్వల్ప వివాదం
ఇద్దరి మధ్య ఘర్షణ చేపల వ్యాపారి మృతి
మచిలీపట్నం (కోనేరుసెంటర్) : మచిలీపట్నంలో ఇరువురి మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఆదివారం మచిలీపట్నంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ బి. వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన లంకే నాగేశ్వరరావు చేపల మార్కెట్‌లో వ్యాపారం చేస్తుం టాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగేశ్వరరావు కొన్ని రోజుల క్రితం తన స్నానాల గది నుంచి వాడుక నీరు బయటికి పోయేలా ఇంటికి ఆనుకుని ఉన్న పంటబోదెలోకి పైపును అమర్చాడు. అదే కాలనీకి చెందిన కాకర్ల చంద్రరావుకు నాగేశ్వరరావు ఇంటి లైనులో కొంత స్థలం ఉంది. పైపు గుండా నాగేశ్వరరావు ఇంట్లోని వాడుక నీరు పంట బోదెలోకి చేరి చంద్రరావు స్థలం వైపుగా పారుతోంది. దీంతో చంద్రరావు నాగేశ్వరరావు ఇంట్లోని మురుగునీరు అంతా పంటబోదె గుండా తన స్థలం వైపు పారుతోందని స్థానికంగా ఉన్న నీటి సంఘం అధ్యక్షునికి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు నీటి సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావును పిలిచి పైపు కారణంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, పైపును అక్కడి నుంచి తీసేయాలని సూచించాడు. అందుకు నాగేశ్వరరావు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని పైపును తీసేస్తానని చెప్పాడు. అక్కడితో సమస్య సద్దుమణిగిపోయింది.
కాగా చంద్రరావు తన స్థలంలో మెరక పనులు చేయించుకుంటూ పంటబోదె పనుల కోసం వచ్చిన జేసీబీ డ్రైవర్‌కు బోదెలోకి ఉన్న పైపును చూపించి తప్పించాలని సూచించాడు. ఇది గమనించిన నాగేశ్వరరావు చంద్రరావుతో వాగ్వివాదానికి దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు చంద్రరావుతో పెనుగులాటకు దిగాడు. చంద్రరావు చేతిలోని గొడుగు కర్రతో నాగేశ్వరరావు తలపై కొట్టి ముందుకు నెట్టాడు. జరిగిన పెనుగులాటలో నాగేశ్వరరావు తల సమీపంలోని గోడకు గుద్దుకుంది. నాగేశ్వరరావు స్పృహ కోల్పోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. టౌన్ సీఐ వరప్రసాద్, మచిలీపట్నం, ఆర్‌పేట ఎస్సైలు ఎండీ అష్ఫాక్, హబీబ్ బాషాలు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుని కుమారుడు నాగేంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.