
దేవుపల్లిలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు
బొండపల్లి : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడానికి... వలసల నివారణకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు. వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ మొదట్లో వంద రోజుల పని కల్పించాలని నిర్ణయించారు. తర్వాత 150 పని దినాలను కల్పిస్తామని అధికారులు, పాలకులు ప్రకటనలు గుప్పించారు. దీంతో వేతనదారులు ఎంతో సంతోషించారు. అయితే టీడీపీ సర్కార్ పథకం అమలు పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వేతనదారులకు కూడా 150 రోజుల పని కల్పించలేకపోయారు. దీంతో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న వారు పనికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. 150 రోజుల ఉపాధి పని ప్రకటనలకే పరిమితం కావడంతో వేతనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 16,452 వేతనదారులు జాబ్‌కార్డులు కలిగి ఉండగా వీరంతా పనులకు వెళ్తున్నారు. వీరిలో సుమారు పది వేల మంది వంద రోజుల పని పూర్తి చేసుకోగా... మిగిలిన వారు వంద రోజుల పని కూడా పూర్తి చేసుకోలేదు. వంద రోజుల పని పూర్తి చేసుకున్న వారు తమకు 150 రోజుల పని కల్పించాలని కోరుతుండగా, మిగిలిన వారు ప్రస్తుతం పనులకు వెళ్తున్నారు.
అందని బిల్లులు
అనుకున్న ప్రకారం పనులు కల్పించలేని అధికారులు మరో పక్క చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేకపోతున్నారు. మండలంలోని దేవుపల్లి, బొండపల్లి, గ్రహపతిఅగ్రహారం, ఎం. కొత్తవలస, బి.రాజేరు, సీటీపల్లి, మరువాడ, జే గుమడాం, వెదురువాడ, ఒంపల్లి, కొండకిండాం, రాచకిండాం, కనిమెరక, రయింద్రం, గరుడబిల్లి, గొట్లాం, ముద్దూరు, నెలివాడ, గొల్లుపాలెం, తదితర గ్రామాల్లో ఎక్కువ మంది వేతనదారులు ఉపాధి పనులపైనే ఆధారపడుతున్నారు. ఇందులో చాలా గ్రామాలకు చెందిన వేతనదారులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పనులు కల్పించడం లేదని, అలాగే చేసిన పనులకు సంబంధించి బిల్లులు కూడా మంజూరు చేయడం లేదని వేతనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించడంతో పాటు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని వేతనదారులు కోరుతున్నారు.
కరువు మండలాల్లోనే..
కరువు మండలాల్లోనే 150 రోజులు పనిదినాలు కల్పిస్తున్నారు. బొండపల్లి మండలంలో 100 రోజులు పనిదినాలు మాత్రమే కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు కూడా 100 రోజులు పనిదినాలే కల్పిస్తున్నాం.
కె.రవిబాబు,ఏపీఓ,బొండపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment