మహబూబ్‌నగర్ : మున్సిపల్, సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. ఎస్పీ నాగేంద్ర కుమార్, అదనపు జేసీ రాజారాం పున్నాతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు.
సాధారణ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను వివరించారు. సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ నెల 9న బూత్ స్థాయిలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 3248 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు విద్యుత్, తాగునీరు, మూత్రశాలలు తదితర మౌళిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. మద్యం, నగదు పంపిణీ ఏ రూపంలో వున్నా అరికట్టేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులకు కోడ్ పర్యవేక్షణ బాధ్యత అప్పగించినట్లు కలెక్టర్ గిరిజా శంకర్ వెల్లడించారు. మహిళా స్వయం సహాయక బృందాల ఖాతాలపై ప్రత్యేక నిఘా వేయాల్సిందిగా బ్యాంకర్లను అప్రమత్తం చేశామన్నారు.
అనుమతి లేని వాహనాలు సీజ్
అనుమతి లేకుండా పార్టీ పతాకాలతో తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ నాగేంద్ర కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచార సామగ్రిపై ప్రచురణ కర్తల చిరునామా, ప్రతుల సంఖ్య తదితర వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు తీరుపై క్షేత్ర స్థాయి పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. మద్యం పంపిణీపై పటిష్ట నిఘా వేయడంతో పాటు కిరాణా షాపులు, నల్ల బెల్లం విక్రయించే దుకాణాలపై దృష్టి సారిస్తామన్నారు. బందోబస్తు కోసం ఇతర జిల్లాలతో పాటు, కేంద్ర బలగాలు కూడా జిల్లాకు వస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.